సబ్ రిజిస్ట్రార్ పై బీజేపీ నేత దాడి..డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని వివాదం

సబ్ రిజిస్ట్రార్ పై బీజేపీ నేత దాడి..డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని వివాదం
  • హయత్ నగర్ పీఎస్​లో పరస్పర ఫిర్యాదులు

ఎల్బీనగర్, వెలుగు: ప్లాట్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ పై ఓ బీజేపీ నేత దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​లో రవీందర్ నాయక్ సబ్ రిజిస్ట్రార్​గా డ్యూటీ చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం పిల్లి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి తన ప్లాట్ ను ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని నిలదీశాడు. అన్ని పత్రాలను పరిశీలించి సబ్ రిజిస్ట్రార్ వివరణ ఇస్తుండగా.. సహనం కోల్పోయి దాడి చేశాడు. ఈ ఘటనపై ఇరువురి ఫిర్యాదుతో హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ రవీందర్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ యాదవ్ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో తనతో వాదిస్తూ దాడి చేశాడన్నారు. 2012లో శ్రీనివాస్ యాదవ్ పెద్దఅంబర్ పేట పరిధిలో ఒక ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. అదే ప్లాట్​జనవరి 2025లో మరో వ్యక్తిపై రిజిస్ట్రేషన్ అయిందన్నారు. దీనిపై తాను విచారణ చేస్తానని చెప్పినా వినకుండా చాంబర్ లోకి వచ్చి దాడి చేశాడన్నారు.1991లో ప్లాట్ అమ్మిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరోసారి ఇతరులకు ప్లాట్ విక్రయించినట్లు వివరించారు. సబ్ రిజిస్టర్ పై దాడి చేసిన వ్యక్తి మున్సిపాలిటీ లో బీజేపీ నాయకుడు కాగా, గత లోకల్ బాడీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పనిచేశాడు.

సబ్ రిజిస్ట్రార్ పై దాడిని ఖండిస్తున్నం: టీఎన్జీఓ 

బషీర్​బాగ్: సబ్ రిజిస్ట్రార్ పై దాడిని టీఎన్జీఓ కేంద్ర సంఘం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన శ్రీనివాస్ యాదవ్ పై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్​మెంట్ అదనపు ఇన్స్ పెక్టర్ జనరల్ వెంకట రాజేశ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ ను దుర్భాషలాడుతూ దాడి చేశారన్నారు. ఏదైనా భూ సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లేదా కోర్టుకు వెళ్లాలని, ఇలా దాడి చేయడం సరికాదన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ కోరారు. మంగళవారం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.