- ప్రభుత్వ ఒత్తిడికి లొంగి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు
- బీజేఎల్ఫీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: ఫిరాయింపుల చట్టానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్అయ్యారు. సోమవారం ఆయన నిర్మల్ లోని తన క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6వ తేదీలోగా వివరణ ఇవ్వాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు జారీ చేసిందన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గడం సరికాదన్నారు. ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఓ అంశాన్ని ఆసరాగా తీసుకొని స్పీకర్ తప్పుడు విధానంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సమావేశంలో బీజేపీ నేతలు అయ్యనగారి రాజేందర్, సాదం అరవింద్ పాల్గొన్నారు.
మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
సబ్సిడీ రుణాలను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని మహేశ్వర్ రెడ్డి సూచించారు. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా సోమవారం నిర్మల్ లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 72 లక్షల 16 వేల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజ అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు కుటీర, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
