
కోహెడ, వెలుగు: కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం కోరారు. బుధవారం కోహెడలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైన ఎందుకు కలపడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రాంత వాసులు ఉమ్మడి జిల్లాలో జరిగే పనులకు కొన్నింటికి సంగారెడ్డి,మరి కొన్నింటికి కరీంనగర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వెంటనే దీనిపై మంత్రి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే వారం రోజుల్లో మరోసారి ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు నర్సయ్య, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్, జగన్,శివ,రాంచంద్రరెడ్డి,సాగర్రావు,రాజు,సంజీవరెడ్డి,అనిల్ తదితరులు ఉన్నారు.