
రాష్ట్రంలో మందు బంద్ పెట్టాలె బీజేపీ మహిళా దీక్షలో డీకే అరుణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాల్సిందేని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. లిక్కర్ వల్లే రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం కోసం గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రెండ్రోజుల మహిళా సంకల్ప దీక్షను అరుణ చేపట్టారు. అరుణతో పాటు బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, పలువురు మహిళా నేతలు దీక్షలో కూర్చున్నారు. అరుణ మాట్లాడుతూ.. మద్యం ద్వారా వస్తున్న ఆదాయంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నడపడం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్రంలో అనేక కుటుంబాలు మద్యం వల్ల ఆర్థికంగా చితికిపోయాయని, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెరుగుతుంటే సీఎంకు కనిపించడం లేదా అని నిలదీశారు. ఉద్యమం టైంలో మద్యంపై మహిళలకు ఇచ్చిన మాటను కేసీఆర్ మరిచిపోయారన్నారు. మద్యం వల్లే దిశ, మానస, సమతలు అత్యాచారానికి, హత్యకు గురయ్యారని ఆవేదన చెందారు. తాగొచ్చిన భర్తలను ఇంటికి రానివ్వమని మహిళలు సంకల్పం తీసుకోవాలని కోరారు. యువతను పెడదారి పట్టిస్తున్న పబ్‌లు, క్లబ్‌లను నిషేధించాలని డిమాండ్ చేశారు.
బ్రాండీ హైదరాబాద్ అయింది: లక్ష్మణ్
సీఎం కేసీఆర్ ‘బార్ బడావో.. బార్ బచావో’ అంటున్నారని, తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ దుయ్యబట్టారు. మద్య నియంత్రణ శాఖను మద్యాన్ని పెంచే శాఖగా మార్చారని విమర్శించారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతుంటారని, కానీ టీఆర్‌ఎస్ పాలనలో బ్రాండ్ హైదరాబాద్ బ్రాండీ హైదరాబాద్‌గా మారిందని విమర్శించారు. బెల్టు షాపులను, అక్రమంగా వెలిసిన పబ్‌లను ధ్వంసం చేయండని మహిళలు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు బార్లు నడుస్తున్నాయని, పర్మిట్ రూంలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర ఆదాయం రూ. 80 వేల కోట్లుంటే రూ. 20 వేల కోట్లు మద్యం నుంచే రావడం విచారకరమన్నారు. ‘దిశ’ హత్య తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మద్యంపై చర్చ జరుగుతోందని, అన్ని అకృత్యాలకు మద్యమే కారణమని అన్నారు. కేసీఆర్ జాన్ జిగిరీ, ఏపీ సీఎం జగన్ ఆంధ్రాలో మద్య నియంత్రణకు ఏం చేస్తున్నారో చూసైనా ఇక్కడ చర్యలు తీసుకోవాలన్నారు. అరుణ దీక్షకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘీభావం తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను మరిచిపోయారన్నారు. తెలంగాణ మహిళలు మందు బందు పెట్టాలని కోరుతున్నారని చెప్పారు.
అరుణ దీక్ష వాళ్లకు హెచ్చరిక: మురళీధర్‌రావు
అహంకారంతో రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లకు అరుణ దీక్ష ఓ హెచ్చరికని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. దీక్షతో ఏమవుతుందనే వారికి భవిష్యత్తులో బీజేపీ అంటే ఏంటో తెలిసొస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పోరాడే పార్టీలకే మద్దతు ఉంటుందన్నారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన మురళీధర్‌రావు.. అరుణకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పు కోసం చేసే పోరాటాలకు బీజేపీ నాయకత్వం వహిస్తుందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడే వారిని కలుపుకుపోతుందని చెప్పారు. మద్య నిషేధం కోసం అరుణ చేస్తున్న పోరాటానికి బీజేపీ నేతలందరూ పూర్తి మద్దతు తెలుపుతున్నారన్నారు. పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ కవి అందెశ్రీ దీక్ష శిబిరాన్ని సందర్శించి అరుణకు సంఘీభావం తెలిపారు.
ఆ రాక్షసుల్ని ఎన్‌కౌంటర్ చేయాలి: సమత భర్త
ఆసిఫాబాద్‌లో మానవ మృగాల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన సమత ఆత్మ శాంతించాలంటే ఆ ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష పడాలని, లేదంటే ఎన్‌కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని సమత భర్త కోరారు. అరుణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన దీక్షలో పాల్గొని మాట్లాడారు. తన భార్యను ముగ్గురు తాగుబోతులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని కంటతడి పెట్టుకున్నారు. మద్యాన్ని నిషేధించాలన్నారు.