తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బాగుపడ్డాయి

తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బాగుపడ్డాయి

చైతన్యపురి: సీఎం కేసీఆర్ తప్పుడు హామీలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. చైతన్యపురిలో బీజేపీ నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న డీకే అరుణ.. కేసీఆర్ సర్కారుపై ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయన్నారు.

‘ఎలక్షన్‌‌లు వచ్చినప్పుడే కేసీఆర్‌‌కు కులాలు గుర్తుకొస్తాయి. ఆర్య వైశ్య కుల ద్రోహులకు కేసీఆర్ పదవులు ఇచ్చారు. పేద వైశ్యులకు ఒరిగిందేమీ లేదు. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ప్రధాని మోడీ కల్పించారు. పక్క రాష్ట్రంలో 10 % ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. తెలంగాణలోనూ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని కేసీఆర్‌‌కు లేఖ రాసినప్పటికీ.. ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. ఆరున్నరేండ్లు గడుస్తున్నా డబుల్ బెడ్ రూమ్‌‌ల హామీని నెరవేర్చలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌కు ఓటుతో గుణపాఠం చెప్పాలి. దుబ్బాక ప్రజలు బీజేపీని గెలిపించి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు’ అని డీకే అరుణ పేర్కొన్నారు.