
కమలాపూర్, వెలుగు:‘‘ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నన్ను ఓడించాలని చూస్తున్నరు. ఎన్నో కుట్రలు చేస్తున్నరు. ఎన్ని వందల కోట్లు కుమ్మరించినా నన్ను ఓడించడం అసాధ్యం” అని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నిక చిన్నది కాదని.. రేపటి భవిష్యత్తును నిర్ణయించేదని చెప్పారు. అందరూ బాధ్యతతో ఓటెయ్యాలని, ప్రమాణాలు చేయవద్దని, ధర్మం అసలే తప్పద్దని ప్రజల్ని కోరారు. నెత్తికెక్కిన కేసీఆర్ కళ్లను దించాలంటే తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదివారం కమలాపూర్ మండలంలోని ఉప్పులపల్లిలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, టీఆర్ఎస్ లీడర్ల బతుకు ఎన్నికల దాకేనని, ఆ తర్వాత వాళ్లను కుక్కలు కూడా దేకవని మండిపడ్డారు. ‘‘ఓట్లేయమని తీర్మానాలు చేయిస్తున్నరు. మా వాళ్లు గొర్రెలమంద కాదు. ఎన్నిసార్లు మోసం చేస్తరు. పథకాలకు ఇచ్చే పైసలన్నీ మావే. మేమే ఓనర్లం.. మీరు కాపలాదారులే. మీరు అనుభవించే ఏ పదవైనా ప్రజలు ఓట్లేస్తే వచ్చినవే. అలాంటి ప్రజలపైనే బెదిరింపులా?” అని ప్రశ్నించారు.
గడ్డిపోచను కాను.. గడ్డపారను..
తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాడి మసైపోతారంటూ టీఆర్ఎస్ లీడర్లను ఈటల హెచ్చరించారు. తాము కష్టపడి పనిచేసేటోళ్లమని.. టీఆర్ఎస్ లీడర్లు మంది సొమ్ము తినేటోళ్లని, అవినీతి డబ్బుతో అంగట్లో సరుకుల్లా నాయకులను, ప్రజాప్రతినిధులను కొంటున్నారని మండిపడ్డారు. తన రాజీనామా వల్లే హుజూరాబాద్‌లో పథకాలన్నీ అమలవుతున్నాయని, తాను గడ్డిపోచను కానని, గడ్డపారనని హెచ్చరించారు. ప్రగతి భవన్‌లో ఉన్నోళ్లకు 4 నెలల నుంచి కంటిమీద కునుకు లేకుండా పోయిందని, పాలన గాలికి వదిలేసి ఈటల ఓటమి కోసమే సర్వశక్తులు ఒడ్డుతున్నారని విమర్శించారు. హుజూరాబాద్ విజయం కోసం ఇతర దేశాల్లో ఉన్నోళ్లు కూడా ఎదురు చూస్తున్నారని, ఈటల గెలిస్తేనే రాష్ట్ర ఆత్మగౌరవం గెలుస్తుందని అందరూ భావిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తీనేని ధర్మారావు, బీజేపీ నేతలు కట్కూరి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు అధికార గర్వం తలకెక్కింది: వివేక్
రాష్ర్టాన్ని సంపాదించుకున్నది కల్వకుంట్ల కుటుంబం కోసమేనా అని బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ప్రజాస్వామిక తెలంగాణ తెస్తామన్న కేసీఆర్.. సీఎం అయ్యాక నియంతలా పాలిస్తుండని మండిపడ్డారు. రాష్ట్ర సాధనలో ఈటల, తాను ముందుండి పోరాడామని చెప్పారు. ఇంత గొడవలోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కేసీఆర్ తన కుటుంబసభ్యులు ఐదుగురికి పదవులు ఇప్పించుకున్నారని చెప్పారు. కేసీఆర్ తన అవసరానికి అందరినీ వాడుకుని పక్కన పెడతారని, నమస్తే తెలంగాణ పత్రిక కోసం ఈటల గతంలో తన సొంత భూమి తాకట్టు పెట్టారని చెప్పారు. ఇప్పుడు అదే భూమిపై ఆరోపణలు చేసి ఈటలను పక్కన పెట్టారని అన్నారు. టీఆర్ఎస్ కు ఓనర్ అన్నందుకు, వడ్ల కొనుగోలు ఉండాలని చెప్పినందుకు ఈటలపై కోపం పెంచుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు అధికార గర్వం తలకెక్కిందని, దేశంలో అతిపెద్ద అవినీతి పరుడు ఆయనేనన్నారు. రాజకీయాలకు రాకముందే ఈటలకు పౌల్ట్రీ ఫామ్స్, 200 ఎకరాల భూమి ఉందని చెప్పారు. ఆయన పన్ను చెల్లించి అవి సంపాదించుకున్నారని.. కానీ కల్వకుంట్ల కుటుంబం పన్నులేవీ కట్టకుండానే సంపాదిస్తోందని ఆరోపించారు. మిషన్ భగీరథలో రూ.40 వేల కోట్ల స్కామ్ చేశారని, ఆ డబ్బులన్నీ హుజూరాబాద్ లో ఖర్చు పెట్టి ఈటలను ఓడించాలని చూస్తున్నారని వివేక్ ఫైర్ అయ్యారు.