12 ఎంపీ సీట్లు గెలిస్తే..రాష్ట్రంలో మాదే అధికారం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

12 ఎంపీ సీట్లు గెలిస్తే..రాష్ట్రంలో మాదే అధికారం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • కాంగ్రెస్​లో ఐదుగురు షిండేలున్నరు: మహేశ్వర్ రెడ్డి
  • సీఎం అభద్రతాభావంలో ఉన్నరు
  • ఎవరికి వారు తమ ఎమ్మెల్యేలను సెట్ చేసి పెట్టుకున్నరని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ పన్నెండు ఎంపీ స్థానాలు గెలిస్తే.. తర్వాత అధికారం తమదే అని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బై ఎలక్షన్లు వచ్చినా.. సార్వత్రిక ఎన్నికలు వచ్చినా.. రాష్ట్రంలో రామరాజ్యం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని, ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణలో బీజేపీ పవర్​లోకి వస్తుందని తెలిపారు. 

బుధవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్​లో మీడియాతో చిట్​చాట్ చేశారు. ‘‘కాంగ్రెస్​లో ఎల్లో, పింక్, గాంధీ కాంగ్రెస్ అన్నీ మిక్స్ అయి ఉన్నయ్. కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నరని మేము ముందే చెప్పినం. రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నరు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేనాటికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. ఒక వేళ అది సాధ్యం కాకపోతే.. బీఆర్ఎస్​లో 20 మంది ఎమ్మెల్యేలు స్పీకర్​ను కలిసి ప్రతిపక్ష నేతను మార్చాల్సిందిగా కోరేలా కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది’’అని తెలిపారు.

రేవంత్ ఎప్పుడు దిగిపోతాడో అని చూస్తున్నరు

సీఎం రేవంత్ రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ‘‘గేట్లు ఎత్తినా పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా రాలేదు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్​తో చేతులు కలిపేందుకు రెడీగా ఉన్నరు. 25 మంది ఎమ్మెల్యేలు మంత్రి కోమటిరెడ్డితో టచ్​లో ఉన్నరు. పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పది మందితో టచ్​లో ఉన్నరు. కాంగ్రెస్​లో సీఎం రేసులో పది మంది ఉన్నరు. రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడో అని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. రెండేండ్ల పదవి అయిపోయాక దిగుతాడా.. ఏదైనా కేసులో ఇరుక్కొని దిగిపోతాడా అనే చర్చ  జరుగుతున్నది’’అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

మేడిగడ్డ అవినీతిపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి

‘‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అయింది. అన్న వెంకట్​రెడ్డి పదవి తీసి ఇస్తారా.. ఇంకెవరిదైనా తీసి ఇస్తారో అనేది చూడాలి. ఖమ్మం, మహబూబాబాద్ మాత్రమే బలమైన సెగ్మెంట్లుగా కాంగ్రెస్ భావిస్తున్నది. ఖమ్మం సీటు కోసం ఎవరు ఏం చేసినా.. పొంగులేటి చెప్పిన వారికే టికెట్ ఇస్తారు. మేడిగడ్డ అవినీతిపై ఎంక్వైరీలో భాగంగా రేవంత్ రెడ్డి టెన్షన్ తట్టుకోలేక ఓ ఐపీఎస్ అధికారి గుండెపోటుతో చనిపోయారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే బాగుండేది’’అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.