కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా కొప్పు బాషా!

కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా కొప్పు బాషా!
  • బైపోల్​లో ఎలాగైనా గెలవాలని బీజేపీ హైకమాండ్​ ప్లానింగ్
  • ఇన్నాళ్లు ప్యారాచూట్​ లీడర్లతో పార్టీకి నష్టం జరిగిందనే చర్చ
  • ఈసారి బలమైన నేతను బరిలో దింపాలని నిర్ణయం

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. టికెట్​కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్​నేత, పెద్దపల్లి లోక్​సభ నియోజకవర్గ ఇన్​చార్జ్ కొప్పు బాషా పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన శ్రీగణేశ్​నారాయణన్ ఇటీవల కాంగ్రెస్​లో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటైన నేతను బరిలో దింపాలని చూస్తోంది. ఇన్నాళ్లు ప్యారాచూట్ లీడర్లపై ఆధారపడడంతో కంటోన్మెంట్ లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి పాలవుతోందనే చర్చ జరుగుతోంది. పార్టీ హైకమాండ్​కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నేతకే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. కొప్పు బాషా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

గత ఎన్నికల్లో 33.64 శాతం ఓట్లు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్​లో బీజేపీ తరఫున పోటీచేసిన చేసిన శ్రీగణేశ్​13.16 శాతం ఓట్లు సాధించారు. ఆ తరువాత బీజేపీని వీడిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్లీ బీజేపీ గూటికి చేరారు. టికెట్​దక్కించుకుని ఎన్నికల బరిలో నిలిచారు. రెండో స్థానానికి పరిమితమై 33.64 శాతం ఓట్లు సాధించారు. ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్​గూటికి చేరారు. కంటోన్మెంట్​లో గతంలో బీజేపీ ఓటింగ్​శాతం పెరగడంతో పార్టీ అధిష్ఠానం ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. కొప్పు బాషా పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2000 నుంచి 2010 వరకు ఏబీవీపీ నాయకుడిగా, 2010 నుంచి బీజేవైఎం, బీజేపీ నాయకుడిగా కొప్పు బాషా పార్టీకి సేవలు అందిస్తున్నారు. 35 ఏండ్లుగా కంటోన్మెంట్​లో మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకే పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయని, ఈసారి తనకు టికెట్​ఇస్తే సామాజిక న్యాయం చేసినట్లు అవుతుందని కొప్పు బాషా పేర్కొన్నారు.