మీకు.. ఇందిరా గాంధీకి ఇదే తేడా: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఫైర్

మీకు.. ఇందిరా గాంధీకి ఇదే తేడా: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ట్రంప్‎ను చూసి భయపడుతున్నాడని అన్నారు. టారిఫ్‎ల ఒత్తిడికి ట్రంప్ ముందు మోడీ తలొగ్గుతున్నారని ఆరోపించారు. మోడీ నాయకత్వం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వానికి పూర్తి విరుద్ధంగా ఉందని విమర్శించారు. 

ఈ మేరకు తేడా అర్ధం చేసుకోండి అంటూ 1971లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమెరికా ఒత్తిడిని ఎలా తట్టుకున్నారో మాట్లాడిన పాత వీడియోను రాహుల్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. 2025 మేలో ఇండియా-పాక్ మధ్య సైనిక ఘర్షణ సమయంలో ట్రంప్ ఫోన్ చేయగానే ప్రధాని మోడీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు.  

కానీ 1971 ఇండియా, పాక్ వార్ సమయంలో అమెరికా ఒత్తిడికి ఇండియా తలొగ్గకుండా ధృడంగా నిలబడిందని గుర్తు చేశారు. పాక్‎కు మద్దతుగా అమెరికా తన ఏడవ నౌకాదళాన్ని పంపినప్పటికీ ఇందిరా గాంధీ వెనక్కి తగ్గలేదని.. నేను చేయాల్సింది నేను చేస్తానని అమెరికాకు ధైర్యంగా బదులిచ్చారని గుర్తు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంతేనని.. కొంచైం ఒత్తిడి ఎదురైనా భయంతో పారిపోతారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ, ఇందిరా గాంధీ మధ్య తేడా ఇదేనని రాహుల్ పేర్కొన్నారు.

ట్రంప్ ఏమన్నారంటే..?

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు దిగుమతి వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ విషయంలో భారత్ తమకు సహకరించకపోతే.. భారతీయ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను మరింత పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్‌‌‌‌‌‌‌‌పై వేగంగా మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉన్నదని చెప్పారు. 

‘‘బేసికల్‌‌‌‌‌‌‌‌గా ప్రధాని మోడీ చాలా మంచి వ్యక్తి. రష్యా చమురు విషయంలో నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం వారికి ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మనం వారిపై వేగంగా సుంకాలను విధించొచ్చు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోడీ, తన మధ్య రాజకీయ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, రష్యాతో భారత్ చమురు వ్యాపారం కొనసాగించడం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దెబ్బ తీస్తోందని కామెంట్ చేశారు. కాగా, సుంకాలు తప్పవని ట్రంప్ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నా మోడీ మాత్రం మౌనం వహించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రంప్ కు మోడీ భయపడుతున్నాడని విమర్శలు  చేస్తున్నారు. ఈ  క్రమంలోనే ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.