నటసింహం నందమూరి బాలకృష్ణ , దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'NBK111' . అయితే ఈ సినిమా గురించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఎంతో అట్టహాసంగా ప్రకటించిన ఈ సినిమా స్క్రిప్ట్‌లో ఇప్పుడు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
నయనతార ఎందుకు తప్పుకుంది?
ముందుగా ఈ చిత్రాన్ని ఒక భారీ హిస్టారికల్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు. ఈ చారిత్రక నేపథ్యంలో బాలయ్య సరసన రాణి పాత్ర కోసం నయనతారను ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించిన నయనతార పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇటీవల 'అఖండ 2' ఫలితం , ప్రస్తుత ఓటీటీ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చారిత్రక కథను పక్కన పెట్టి, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథను మార్చేశారని టాక్ వినిపిస్తోంది.
రెమ్యూనరేషన్ ఇబ్బందులు..
మరో వైపు ఈ సినిమా కోసం నయనతార దాదాపు రూ. 8 నుండి 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంత పెద్ద మొత్తం నయనతారకు ఇచ్చే బదులు, రూ. 2 కోట్లలోపు వచ్చే మరో హీరోయిన్‌ను తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..
కథలో కీలక మార్పులు
ఈ సినిమా నుంచి నయనతారను తప్పించడమే కాదు.. పూర్తిగా సినిమా కథనే మార్చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని మొదట అనుకున్న పీరియడ్ డ్రామా కాన్సెప్ట్‌ను పక్కన పెట్టి, బాలయ్య మార్క్ డైలాగ్స్ , హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన కొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుల వల్ల సినిమా నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, బాలయ్య మాస్ ఆడియన్స్‌కు ఇది బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.
►ALSO READ | Deepika Padukone: డిగ్రీ అయిపోయిందా? జాబ్ వద్దు అనుకుంటే.. దీపికా ఇచ్చిన ఛాన్స్ మిస్ అవ్వకండి!
బాలయ్య జోరు.. ఫ్యాన్స్ ఆశలు
వరుసగా ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ వంటి హిట్‌లతో ఊపు మీదున్న బాలయ్య.. రీసెంట్‌గా 'అఖండ 2' తో సందడి చేశారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘NBK111’ ను మరింత పవర్ ఫుల్ గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. నయనతార స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ మార్పులపై చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే కొత్త తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
