ట్రంప్ దూకుడు చర్యలతో అంతర్జాతీయంగా కొనసాగుతున్న కల్లోలం భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు వరుసగా మూడో రోజుకూడా నష్టాలనే మిగిల్చింది. సాయంత్రం మార్కెట్ల ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 102 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 38 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో బ్యాన్ నిఫ్టీ సూచీ 128 పాయింట్లు నష్టపోయింది. అయితే ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం మంచి లాభాలను నమోదు చేసింది.
ప్రధానంగా ఇవాళ ఇంట్రాడేలో ఫార్మా, ఐటి రంగాలకు చెందిన షేర్లు పుంజుకోగా.. ఆటో స్టాక్స్ నష్టాలను మిగిల్చాయి. దీంతో టైటాన్, టెక్ మహింద్రా, హెచ్సీఎల్ టెక్, విప్రో, జియో ఫైనాన్స్ కంపెనీలు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇక సిప్లా, మారుతీ సుజుకీ, మ్యాక్స్ హెల్త్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కంపెనీలు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.ఇదే క్రమంలో టెలికాం స్టాక్స్ కూడా కొంత నష్టాలను చూశాయి.
భారత మార్కెట్ల వరుస నష్టాల వెనుక కారణాలను పరిశీలిస్తే.. అన్నింటి కంటే ముఖ్యమైనది అమెరికా వెనిజులా మధ్య కొనసాగుతున్న పరిస్థితులని చెప్పుకోవచ్చు. అలాగే శాంక్షన్స్ విధించిన క్రూడ్ తమకు అప్పగించాలని దానిని మార్కెట్ ధరకు కొంటమే కాక ఆ డబ్బు ఎలా ఎందుకు ఖర్చుచేయాలో తానే నిర్ణయిస్తానంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కుదుపును క్రియేట్ చేశాయి. రెండు రోజుల భారీ పతనం తర్వాత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు స్వల్పంగా మెుగ్గుచూపటంతో నేడు మార్కెట్లు భారీ నష్టాల నుంచి తేరుకుని చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
