భాగ్యలక్ష్మి టెంపుల్​ దగ్గరికి రా..రిజర్వేషన్లపై చర్చిద్దాం : ఎంపీ లక్ష్మణ్

భాగ్యలక్ష్మి టెంపుల్​ దగ్గరికి రా..రిజర్వేషన్లపై చర్చిద్దాం : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై చర్చించేందుకు భాగ్యలక్ష్మి టెంపుల్​దగ్గరికి రావాలని ఆయన సవాల్ విసిరారు. అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆరోపించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియా ఇన్ చార్జ్​ ఎన్​వీ సుభాష్ తో కలిసి లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు వద్దని 1961లోనే నెహ్రూ అప్పటి సీఎంలకు లేఖలు రాశారని గుర్తుచేశారు.

 రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో బీసీలకు 27% రిజర్వేషన్లు వ్యతిరేకించింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోటీ జరుగుతోందన్నారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్​కు పరాభవం తప్పదని, మిగిలేదీ గాడిద గుడ్డేనని చెప్పారు. ఈ ఎన్నికలు చాయ్ వాలా మోదీకి.. అగర్భ శ్రీమంతుడు రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న పోటీ అని, దేశాభివృద్ధికి.. కుటుంబ రాజకీయాలకు మధ్య జరుగుతున్న పోటీ అని అభివర్ణించారు. 

కాంగ్రెస్ నేతలు ఆర్ఆర్​ ట్యాక్స్ పేరుతో జలగల్లా పీడిస్తున్నారని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు కించపర్చే విధంగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. హిందూ దేవుళ్లు, రాముడు అంటే ఎందుకంత కోపం అని లక్ష్మణ్​ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు కావాల్సిన వారితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నింపుకొని, నిరుద్యోగులకు గాడిద గుడ్డు చూపించారని ఆయన ఎద్దేవా చేశారు.