లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కార్ : లక్ష్మణ్ 

లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కార్ : లక్ష్మణ్ 
  • కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే, దానికి వాళ్లే బాధ్యులు
  • బీఆర్ఎస్.. ఓ చచ్చిన పాము అని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ‘‘తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయం. అయితే అది ఐదేండ్లు అయినంక జరిగే ఎన్నికల తర్వాతనా? లేదంటే వాళ్లంతట వాళ్లే (కాంగ్రెస్) ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారా అనేది చూడాలి.

ప్రభుత్వం పడిపోతే దానికి వారే బాధ్యులు” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. లక్ష్మణ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల సీఎం రేవంత్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ‘‘తెలంగాణలో  బీఆర్ఎస్ ఒక చచ్చిన పాము.

ఎక్కడిక్కడ ఆ పార్టీ చీలికలు పేలికలుగా విడిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్​ను ఉపేక్షించే పరిస్థితే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ కు బలం చేకూర్చే కుట్రలు చేస్తున్నది” అని ఆరోపించారు. ‘‘దేశంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతున్నది. ఆ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారు. మోదీకి సరితూగే వ్యక్తి విపక్షాల కూటమిలో లేడు. కాంగ్రెస్ రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలు మోసపోయి కాంగ్రెస్​ను గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు ఓటమి తప్పదని అన్నారు.