- రాజన్న సన్నిధిలో కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు
వేములవాడ, వెలుగు: కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి అనుబంధ ఆలయం భీమేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్‌తోపాటు ఏపీ, చత్తీస్‌గఢ్, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు గత రాత్రే వేములవాడకు చేరుకున్నారు.
తెల్లవారుజామున నుంచే భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పవిత్ర స్నానాలు ఆచరించి చేసి స్వామి వారి దర్శనం కోసం క్యూలెన్‌లో వేచియున్నారు. స్వామి వారికి అభిషేకం నిర్వహించి, ఆలయంలో కార్తీక ద్వీపాలు వెలిగించారు. కోడె మొక్కులు తీర్చేందుకు భక్తులు గంటల తరబడి క్యూలెన్ లో వేచియున్నారు.
ఉదయమే భీమేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ది విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయ ముందు భాగంలో ప్రచార రథంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకున్నారు.
