కొడిమ్యాల మండల రైతులు కటింగ్ లేకుండా వడ్లు కొనాలని ధర్నా

కొడిమ్యాల మండల రైతులు కటింగ్ లేకుండా వడ్లు కొనాలని ధర్నా

కొడిమ్యాల, వెలుగు: కటింగ్‌‌‌‌‌‌‌‌ లేకుండా వడ్లు కొనాలని కొడిమ్యాల మండల రైతులు పూడూరు హైవేపై ఆదివారం ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటలపాటు ధర్నా చేయడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌‌‌‌‌‌‌‌ అయింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 40 కేజీల బస్తాకు 4 కేజీల మేర వడ్లు కటింగ్ పెడుతున్నారని ఆరోపించారు. 

ప్రభుత్వం, మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. మిల్లర్లు ఎలా చెప్తే సెంటర్ నిర్వాహకులు అలా కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కటింగ్ లేకుండా వడ్లు కొంటున్నారని, అదే కొడిమ్యాల, మల్యాల మండలాల్లో క్వింటాల్​కు 10 కేజీలు కటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 

పోలీసులు, ఎస్సై సందీప్ వచ్చి ఎంత చెప్పినా రైతులు వినలేదు. ఈక్రమంలో రైతులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. చివరికి తహసీల్దార్ కిరణ్ ధర్నా వద్దకు వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.