
ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు లో టీఆర్ఎస్ పాత్ర ఎంత ఉందొ…బీజేపీ పాత్ర అంతకు ఎక్కువే ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం.. వెబ్ సైట్ లో పారదర్శకంగా ప్రాజెక్టు వివరాలన్ని అందుబాటులో పెట్టాలన్నారు.
కాళేశ్వరంకి అనుమతులు తెచ్చింది బీజేపీయేనని, కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని పనులను తెలంగాణకి సాధించామని లక్ష్మణ్ అన్నారు. గడచిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, టీఆరెస్ వాళ్ళు చెప్పే మాటలకు ప్రజలు మోసపోరని ఆయన అన్నారు.
అధికార పార్టీ బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కి తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ అక్రమ అరెస్టులు,అక్రమ కేసు బనాయింపులకు పాల్పడడం సబబు కాదన్నారు. ఎమ్మెల్యే రాజసింగ్ పై జరిగిన దాడి ని చూస్తే బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్టు ఉందన్నారు. రాజసింగ్ పై జరిగిన దాడిలో మొదట వీడియో విడుదల చేయాలని లక్ష్మణ్ అన్నారు.
ఈ దాడులు, కేసీఆర్ కుటుంబ పాలన, నియంత పోకడల గురించి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు తెలుపుతామని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను,రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఆయనకు క్షుణ్ణంగా వివరిస్తామని చెప్పారు.
త్వరలో అన్ని పార్టీల నుంచి బీజేపీలో చేరికలుంటాయని లక్ష్మణ్ ఈ సందర్భంగా అన్నారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకుని బీజేపీ లో జాయిన్ అయ్యారని ఆయన అన్నారు.