
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. పార్లమెంటుకు పోటీ చేసేందుకు తాను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని.. అసెంబ్లీకి అయినా ఓకే అని అన్నారు. ఎంత మంది బీజేపీలో చేరినా ఇబ్బంది లేదని.. వారికి ఏదో ఒక బాధ్యత అప్పగిస్తామని మురళీధర్ రావు చెప్పారు. పార్టీలోని ఒరిజినల్ క్యాడర్ ఎక్కడ ఇబ్బంది పడటం లేదని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా బూమరాంగ్ అవుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం నట్లు, బోల్టులు అన్ని కేసీఆర్ దగ్గరే ఉన్నాయన్నారు. ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో లెఫ్ట్ పార్టీల ప్రభావం పెద్దగా లేదని.. వాటికి ఓటు బ్యాంక్ కూడా లేదని తెలిపారు.