కాళేశ్వరం స్కామ్‌‌‌‌‌‌‌‌పై సీబీఐ విచారణ కోరాలి : రఘునందన్ రావు

కాళేశ్వరం స్కామ్‌‌‌‌‌‌‌‌పై  సీబీఐ విచారణ కోరాలి : రఘునందన్ రావు
  • పీసీసీ చీఫ్ హోదాలో అడిగి.. సీఎం హోదాలో ఎందుకు అడగట్లే?
  • రేవంత్ రెడ్డికి బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్న

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆధారాలతో కూడిన లేఖను సీఎం రేవంత్ రెడ్డి రాయాలని బీజేపీ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ‘‘కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు?” అని ప్రశ్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరం అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయంటూ గతంలో అమిత్ షాకు రేవంత్ లేఖ రాశారని ఇప్పుడు సీఎంగా ఆయన దగ్గర ఉన్న ఆధారాలతో లేఖ రాయాలని అన్నారు. కాళేశ్వరం అవినీతిని మేడిగడ్డ వరకే పరిమితం చేయాలనే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టీ సంస్థపై అవినీతి నెపం నెడుతున్నారని, ఇందులో మేఘా కంపెనీ పాత్ర ఉందని ఆరోపించారు.