చంద్రబాబు కంటే కేసీఆర్..  వేయి రెట్లు దోచుకున్నడు :రవీంద్ర నాయక్

చంద్రబాబు కంటే కేసీఆర్..  వేయి రెట్లు దోచుకున్నడు :రవీంద్ర నాయక్

హైదరాబాద్, వెలుగు: అవినీతి ఆరోపణలపై చంద్రబాబును జైలుకు పంపినపుడు,  కేసీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. చంద్రబాబు కంటే వేయి రెట్లు ఎక్కువగా కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకుందని  మంగళవారం విడుదల చేసిన  ప్రకటనలో  రవీంద్ర నాయక్ ఆరోపించారు. భూ దందా, లిక్కర్, ఇసుక , గ్రానైట్ మాఫియా ఇలా అన్ని రకాలుగా కేసీఆర్ దోచుకున్నడన్నారు.  కేసీఆర్ అవినీతిపై ప్రధాని మోదీ, అమిత్ షా లు ఎన్నో సార్లు ఫైర్ అయ్యారని, ఇప్పటికైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  దోచుకున్న డబ్బుతో ఓటర్లను మభ్య పెట్టి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడన్నారు.  కేసీఆర్ అవినీతిపై కాగ్ రిపోర్ట్ ను, గవర్నర్ నుంచి నివేదిక ను తీసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాలన్నారు. 

బాబుని అరెస్ట్ చేసిన విధానం తప్పు:  బండి సంజయ్ 

టీడీపీ చీఫ్ ​చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని ఎంపీ బండి సంజయ్ అన్నారు.  ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే సీఎంగా  సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను  అరెస్ట్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.  చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని సంజయ్ అన్నారు.