పోలీసుల అదుపులో బీజేపీ నేత శరణ్

పోలీసుల అదుపులో బీజేపీ నేత శరణ్
  • రియల్  ఎస్టేట్స్ పేరుతో రూ.5 కోట్లు మోసం చేశాడని ఆరోపణలు
  • ఈనెల 9న పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
  • దర్యాప్తులో భాగంగా శరణ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: కూకట్‌‌పల్లి బీజేపీ నేత శరణ్‌‌ కుమార్‌‌‌‌ చౌదరిని హైదరాబాద్  సిటీ సెంట్రల్‌‌  క్రైమ్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియల్ ఎస్టేట్‌‌ లో ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ పేరుతో శరణ్  ఒకరిని మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని కూడా ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేత శరణ్‌‌ కుమార్‌‌‌‌  అదృశ్యం అయ్యారంటూ సోమవారం రాత్రి కలకలం రేగిన విషయం తెలిసిందే. దీంతో మాదాపూర్‌‌‌‌ పోలీసులు మిస్సింగ్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే, శరణ్‌‌‌‌ను సిటీ సీసీఎస్‌‌ ఎకనామిక్  అఫెన్సెస్‌‌  వింగ్‌‌  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన  మిస్సింగ్ మిస్టరీకి తెరపడింది.

రియల్ ఎస్టేట్‌‌లో పెట్టుబడి పెడితే  రిటర్న్స్ ఇస్తామని ఆశలు

యూసుఫ్‌‌గూడ ఎల్‌‌ఎన్ నగర్‌‌‌‌కు చెందిన రమేశ్ కుమార్‌‌‌‌ను గత ఏడాది అక్టోబర్‌‌‌‌ 12న వడ్డెవల్లి శరణ్‌‌ కుమార్‌‌‌‌, అతని భాగస్వాములు ఆంథొని రెడ్డి, కె.బోసుబాబు, కె.రాహుల్‌‌ కలిశారు. రియల్‌‌ ఎస్టేట్‌‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని వారు రమేశ్ కు చెప్పారు. తమ రియల్‌‌ ఎస్టేట్‌‌ సంస్థలో రూ.10 కోట్లు పెట్టుబడి పెడితే కొద్ది నెలల్లోనే రిటర్న్స్ ఇస్తామని నమ్మించారు.లేకపోతే ఏడాదికి 24 శాతం రిఫండ్  చేస్తామని అగ్రిమెంట్‌‌  చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర్‌‌‌‌  మండలం బోరపట్లలో 350 ఎకరాలకు సంబంధించిన రైతుల పాస్‌‌ పుస్తకాలు, ధరణి రికార్డులను రమేశ్​కు చూపించారు. అనంతరం రమేశ్ ను బోరపట్లకు తీసుకెళ్లి వెంచర్  వేస్తున్న ఏరియాను చూపించారు. ఆఫర్  నచ్చడంతో పెట్టుబడులు పెట్టేందుకు రమేశ్ కుమార్‌‌‌‌  సిద్ధమయ్యాడు. ముందుగా రూ.5 కోట్లు న్యూజెర్సీలోని తన సోదరుడు విజయ్‌‌కుమార్‌‌‌‌  వద్ద సేకరించాడు. ఈ డబ్బును నిరుడు అక్టోబర్‌‌‌‌14న శరణ్  కుమార్, బోసుబాబు, ఆంథొని రెడ్డి, రాహుల్ కు ఆన్‌‌లైన్‌‌లో ట్రాన్స్‌‌ఫర్ చేశాడు. అయితే, డబ్బు పంపిణీ విషయంలో ప్రమోటర్ల మధ్య అంతర్గత విభేదాలు వచ్చాయని రమేశ్  గుర్తించాడు. 

అనుమానంతో సైట్‌‌కి వెళ్లి ఆరా తీశాడు. వెంచర్‌‌‌‌ పేరుతో తనను మోసం చేసినట్లు గుర్తించాడు. తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆ నలుగురిని రమేశ్  డిమాండ్ చేశాడు. దీంతో శరణ్‌‌ కుమార్​తోపాటు మిగతా ముగ్గురు ప్రమోటర్లు రమేశ్ కు చెక్స్‌‌  ఇచ్చారు. అయితే ఆ చెక్కులు బౌన్స్‌‌ అయ్యాయి. ఈ విషయం గురించి నిలదీయగా వారు రమేశ్ ను బెదిరించారు. దీంతో బాధితుడు హైదరాబాద్‌‌  సీసీఎస్‌‌ పోలీసులకు ఈనెల 9న ఫిర్యాదు చేశాడు. శరణ్‌‌ కుమార్‌‌‌‌, ఆంథొని రెడ్డి, బోసుబాబు, రాహుల్‌‌ తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్తం రూ.6.1 కోట్లు నష్టపోయానని ఆరోపించాడు. కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం మధ్యాహ్నం శరణ్‌‌ కుమార్‌‌‌‌ను సీసీఎస్‌‌  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.