మధ్యాహ్న భోజనం బిల్లులు ఎందుకు చెల్లించట్లే?

మధ్యాహ్న భోజనం బిల్లులు ఎందుకు చెల్లించట్లే?

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే పిల్లలకు భోజనం పెడుతున్న ఏజెన్సీలకు నాలుగు నెలలుగా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర సర్కారును బీజేపీ నేత విజయశాంతి ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. ఈ మేరకు విజయశాంతి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నెలవారీ బిల్లులు వస్తే తప్ప పిల్లలకు భోజనం వండిపెట్టలేని స్థితిలో ఏజెన్సీలు ఉన్నాయని, నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో అప్పులకు వడ్డీలు చెల్లించలేక వారంతా రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు బిల్లులు చెల్లించకపోవడంతో సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సమ్మె చేస్తున్నారని, దీంతో టీచర్లే పిల్లలకు వంట చేసి పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్‌‌‌‌ పేద స్టూడెంట్లు చదువుకునే స్కూళ్లలో వంటలు చేసే నిర్వాహకులకు బిల్లులు ఎందుకు చెల్లించడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.