రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయట పడేయాలంటే బీజేపీతోనే సాధ్యం 

రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయట పడేయాలంటే బీజేపీతోనే సాధ్యం 

మంచిర్యాల జిల్లా : ప్రధాని నరేంద్ర మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు సంవత్సరానికి 2 లక్షల ఇండ్ల చొప్పున.. మొత్తం 16 లక్షల ఇండ్ల నిర్మాణాలకు డబ్బులు అందించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి. వివేక్ వెంకటస్వామి చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు గానీ.. పేద ప్రజలకు మాత్రం కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించడం లేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని గుల్లకోట, సురారం, పోతపల్లి, అంకతిపల్లి, శాంతపూర్, తిమ్మాపూర్, లక్ష్మీపూర్, బాలరావుపేట, జెండవెంకటపూర్, రంగపేట, హనుమంతపల్లి, చందారం, దౌడపల్లి, కొత్త, పాత కొమ్ముగూడెం, వెంకట్రావుపేట గ్రామాల్లో నిర్వహించిన ‘ప్రజా గోస..బీజేపీ భరోసా’ బైక్ యాత్రలో జి. వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు. 

సర్కారు హాస్టళ్లలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భోజనం కూడా పెట్టడం లేదని, అందుకే చాలాచోట్ల విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో మునుగోడు ఉప ఎన్నిక ఉందనే సీఎం కేసీఆర్ పింఛన్లు ఇస్తున్నారని అన్నారు. దేశంలో నెంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయట పడేయాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమని చెప్పారు.