
ముషీరాబాద్/జీడిమెట్ల/ ఎల్బీనగర్/శంషాబాద్/గండిపేట/వికారాబాద్/ చేవెళ్ల, వెలుగు: మునుగోడులో ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో టీఆర్ఎస్ డ్రామా ఆడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. గురువారం గ్రేటర్ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. బీజేపీ ముషీరాబాద్ సెగ్మెంట్ కో కన్వీనర్ రమేశ్‌రామ్, నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీ నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీశ్ ఆధ్వర్యంలో ప్రగతినగర్‌లో, ఎల్ బీనగర్ పరిధి హస్తినాపురం చౌరస్తాలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. బీజేపీ కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. హయత్ నగర్, మన్సూరాబాద్ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనలు జరిగాయి.
నార్సింగి పరిధి మంచిరేవుల చౌరస్తాలో గండిపేట మండల అధ్యక్షుడు భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. శంషాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలోనూ ఆందోళనలు జరిగాయి. యూసుఫ్‌గూడ చెక్ పోస్టు వద్ద బీజేపీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను, టీఆర్ఎస్ నాయకులు మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య గొడవ జరగగా.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గొడవ కారణంగా యూసుఫ్ గూడ చౌరస్తాలో సుమారు గంటకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రెండు పార్టీలకు చెందిన వారు ఒకరిపై ఒకరు పీఎస్ లో కంప్లయింట్ చేశారు.