ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద నేరమైంది : బండి సంజయ్

ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద నేరమైంది : బండి సంజయ్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్త హిందువుల ఆరాధ్యదైవం అయోధ్య రాముడిపై అనుచిత వ్యాఖ్యలు తగదని అడగటమే తెలంగాణలో పెద్ద నేరమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూత్వాన్ని, హిందువులను కించపర్చటం, అవమానించే వ్యాఖ్యలు చేయటం సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా టీఆర్ఎస్ వాళ్లకు ఫ్యాషనైపోయిందని ఆయన విమ‌ర్శించారు. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ లతో పాటు మరో 42 మంది బీజేపీ కార్యకర్తలు, రామభక్తులకు బుధ‌వారం బెయిల్ రావటంపై సంజ‌య్ హర్షం వ్య‌క్తం చేశారు. అక్రమ అరెస్టులకు భయపడకుండా రామకార్యంలో పాల్గొన్న రామభక్తులందరికీ అభినందనలు తెలిపారు.

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఆరుగురు మహిళలను అక్రమంగా జైలుకు పంపారని…. మరో 38 మంది బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశార‌న్నారు. అక్రమ అరెస్ట్ లకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నడూ బెదిరే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ వాళ్లను అరెస్ట్ చేయటానికి జైళ్లు చాలక పోతే…. ప్రగతి భవన్ ను, మీ ఫాంహౌజ్ ను కూడా జైళ్లుగా మారుస్తారా….? అని ప్ర‌శ్నించారు సంజ‌య్. దేశం కోసం, ధర్మంకోసం పోరాటాలు, అరెస్టులు బీజేపీ కార్యకర్తలకు కొత్తేం కాదని అన్నారు.

రాముడిని కించపరిచిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యా తీసుకోలేదంటేనే, కేసీఆర్ కు హిందుత్వంపై వున్న గౌరవం అర్థమవుతోంద‌న్నారు. ఎవరైతే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ రామయ్యను కించపరిచారో సదరు మంత్రులు, ఎమ్మెల్యేలను మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని అన్నారు. బీజేపీ నాయకులపై, ఇళ్లపై, కార్యాలయాలపై దాడి చేసిన టీఆర్ఎస్ గూండాలను కూడా అరెస్ట్ చేసి ఎందుకు జైళ్లలో పెట్టడం లేదని ప్ర‌శ్నించారు. రామున్ని అనుక్షణం నిందించే మీకు తెలంగాణా ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తార‌న్నారు. రాముడితో పెట్టుకున్న ముల్లా ములాయంసింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ లకు పట్టిన గతే… కేసీఆర్ కు త్వరలోనే పడుతుందన్నారు. రాముడి పట్ల, ధర్మం పట్ల తమ నిబద్ధతను, ఆకాంక్షలను మరింత పెంచాయని, ఇంతకు వందింతల ఉత్సాహంతో రామాలయ నిర్మాణం కోసం రామభక్తులు పనిచేస్తారన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం హిందువుల స్వాభిమానానికి చిహ్నమ‌ని, మందిర నిర్మాణం ప్రతి ఒక్కరి ఆకాంక్ష అన్నారు. రామ రాజ్య స్థాపనకు ప్రతి కర సేవకుడు కృషి చేస్తారని ఎటువంటి నిర్బంధాల కైనా వెనుకాడబోరని సంజ‌య్ అన్నారు.