తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నరు

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నరు

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని బీజేపి నేతలు కలిశారు. బండి సంజయ్ అరెస్ట్...ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకున్న తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. బీజేవైయం, మహిళామోర్చ నాయకులు,కార్యకర్తలపై ప్రభుత్వం, పోలీసులు వ్యవ్యహరిస్తున్న తీరుపై తమిళిసైకి వివరించారు. గవర్నర్ తో బీజేపీ నేతలు ఎంపీ డా.లక్ష్మణ్ ,విజయశాంతి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి,రఘునందన్ రావు, డీకే అరుణ,కొండా విశ్వేశ్వర్ రెడ్డి  తదితరులు హాజరయ్యారు. 

రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా సాగుతున్న బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అనుమతితోనే ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాదయాత్ర పై దాడులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బండి సంజయ్ పాదయాత్ర పై దాడికి తెగ బడ్డారని చెప్పారు. 

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని లక్ష్మణ్ తెలిపారు.టీఆర్ఎస్ చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి అసహనంతో, నిరాశ నిస్పృహలతో దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.సంజయ్ పాదయాత్రపైజరిగిన దాడి ఘటనపై విచారణ జరపాలని గవర్నర్ ని కోరామన్నారు. 

కవిత ఓపెనింగ్ వికెట్ పడబోతుంది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ దాడులకు తెగబడుతుందని మాజీఎంపీ విజయశాంతి అన్నారు. టిఆర్ఎస్ బండారం యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.