బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలే అడ్డు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలే అడ్డు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కామారెడ్డి సభలో కిషన్​రెడ్డి, సంజయ్ బాగోతం బయటపెడ్తం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ఈ సభ తర్వాత కేంద్రం దిగిరాక తప్పదు
  • బీసీ బిల్లులను టెంపరరీగా ఆపుతరేమో.. పర్మినెంట్‌‌గా అడ్డుకోలేరు 
  • బీసీ కోటా తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి
  • సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో తిరుగుదామా? అని బండి సంజయ్‌‌కి సవాల్

కామారెడ్డి, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా బీజేపీ రాష్ట్ర నాయకులే అడ్డుకుంటున్నారని, నోటిదాకా వచ్చిన కూడును తన్నేస్తున్నారని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్ ​గౌడ్ ఫైర్ ​అయ్యారు. ‘‘బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకుల బండారం బయటపెట్టేందుకే ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ తర్వాత  బీజేపీ దిగిరాక తప్పదు. సభలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్​రెడ్డి బాగోతాన్ని బయటపెట్టి, బట్టలు ఊడదిస్తం” అని అన్నారు. ఆదివారం కామారెడ్డిలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి,  పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ పర్యటించారు. సభ నిర్వహణ కోసం ఇందిరాగాంధీ స్టేడియం, డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభ సన్నాహక సమావేశంలో మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం సమరభేరి మోగించనున్నట్టు చెప్పారు. ఈ సభతో కేంద్రానికి  కనువిప్పు కలగాలని.. మోదీ, అమిత్​షా ఆరా తీయాలని అన్నారు. ‘‘బీసీ బిల్లులను బీజేపీ నేతలు  టెంపరరీగా ఆపగలరేమో. కానీ పర్మనెంట్‌‌‌‌‌‌‌‌గా అడ్డుకోలేరు. మూడేండ్ల తర్వాత కేంద్రంలో రాహుల్​గాంధీ ప్రధాని అవుతారు. అప్పుడు బాజాప్తా బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం” అని చెప్పారు. ‘‘బీసీ బిల్లులను బీజేపీలోని బీసీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్​దొంగాట ఆడుతున్నారు. ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ ఎందుకు మాట్లాడడం లేదు? తాను బీసీనని చెప్పుకునే బండి సంజయ్​నడవడిక, వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలా లేదు. అందుకే ఆయనను దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్ అన్నాను. సంజయ్..​ నీకు బీసీ పౌరుషం ఉంటే కేంద్రాన్ని ఒప్పించో.. బతిమాలో బీసీ బిల్లుల ఆమోదం కోసం ప్రయత్నించు. కిషన్​రెడ్డి, బండి సంజయ్​తలుచుకుంటే ఒక్క రోజులోనే బిల్లులకు చట్టబద్ధత లభిస్తుంది” అని అన్నారు.  

కవిత ఎపిసోడ్.. కేసీఆర్ నాటకం 
బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ‘‘స్థానిక ఎన్నికలు వెంటనే జరపాలని మా మంత్రులు కోరారు. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఆగుదామని నచ్చజెప్పాం. ఎన్నికలెంత ముఖ్యమో బీసీ రిజర్వేషన్లు కూడా అంతే ముఖ్యం. బీసీ రిజర్వేషన్లు వస్తేనే ఎన్నికలకు పోదామనే నిర్ణయానికి వచ్చాం” అని తెలిపారు. కవిత ఎపిసోడ్ అంతా కేసీఆర్ ఆడిస్తున్న నాటకమని అన్నారు. ‘‘కల్వకుంట్ల కవితను నిజామాబాద్ జిల్లా కోడలుగా అభిమానిస్తాం. కానీ లిక్కర్​ రాణిలా ఆమె చెడ్డ పేరు తెచ్చారు. బీఆర్ఎస్ ప్రజాధనాన్ని దోచుకున్నదని మేం మొదటి నుంచీ చెప్తున్నాం. ఇప్పుడు కవిత కూడా చెప్పడంతో మా మాటలు నిజమని తేలింది. దోచుకున్న సొమ్ము పంపకాల్లో తేడాతోనే కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు రేగింది. హరీశ్​రావు, సంతోష్​రావుకు ఎక్కువ వాటా పోతున్నదని కవిత బాధపడుతున్నారు. కానీ ఈ అవినీతి గురించి కవిత ఏడేండ్ల కింద చెప్పి ఉంటే సన్మానించేవాళ్లం. ఇదంతా కేసీఆర్​ఆడిస్తున్న నాటకం. 

కాళేశ్వరం అవినీతి బయటపడడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు” అని మండిపడ్డారు. తాను సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్లడం లేదని బండి సంజయ్​అసత్య ప్రచారం చేయిస్తున్నారని మహేశ్ గౌడ్ మండిపడ్డారు.‘‘నేను సెక్యూరిటీ లేకుండా వస్తాను. బండి సంజయ్.. నువ్వు కూడా సెక్యూరిటీ లేకుండా వస్తావా? రేపటి నుంచి ఇద్దరం కూడా గన్‌‌‌‌‌‌‌‌మెన్ లేకుండా ప్రజల్లో తిరుగుదాం. అప్పుడు ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూద్దామా?” అని సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు రాముడు, శివుడు, ఆంజనేయుడు అంటూ దేవుళ్ల పేరుతో ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లని విమర్శించారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పి ఓట్లడిగే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని నిలదీశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, జహీరాబాద్​ఎంపీ సురేశ్​షెట్కార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల​చైర్మన్లు పాల్గొన్నారు.  

బీసీ కోటాపై బీజేపీ రాజకీయం: మంత్రులు 
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాజకీయం చేస్తున్నదని, బిల్లులను అడ్డుకుంటున్నదని మంత్రులు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. దేశానికి రోల్‌‌‌‌‌‌‌‌మోడల్‌‌‌‌‌‌‌‌గా ఉండేలా రాష్ట్రంలో కులగణన చేపట్టామని చెప్పారు.  బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మోకాలడ్డుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీలకు న్యాయం జరగకుండా బిల్లులను అడ్డుకుంటున్నదని ఫైర్ అయ్యారు. కేంద్రం మీద సమరభేరి మోగించేందుకే కామారెడ్డిలో సభ పెడుతున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ, సీఎం​రేవంత్​రెడ్డి తపిస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాజకీయం చేస్తున్నదని మంత్రి సీతక్క మండిపడ్డారు.