బీజేపోళ్లకు పిచ్చిలేసింది : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

బీజేపోళ్లకు పిచ్చిలేసింది : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
  •   ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్షీకి సారీ చెప్పాలి

 
హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీపై ఆయన చేసిన ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. దీపాదాస్ మున్షీ నిజాయితీ, నిబద్ధత గల నాయకురాలని తెలిపారు. ఆమె తెలంగాణ ఇన్​చార్జ్ గా ఉండడంతో బీజేపీ లీడర్లకు నిద్ర పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో స్వీప్ చేయబోతుందన్నారు.

 ‘లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో  ఆ పార్టీ లీడర్లు పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తున్నరు. పస లేని, పనికి రాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పూట గడుపుకోవడానికి కుట్రలు చేస్తున్నరు. తమ పార్టీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం.. జాగ్రత్త.. ప్రభాకర్ వెంటనే దీపాదాస్ మున్షీకి సారీ చెప్పి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి’ అని మహేశ్​కుమార్​గౌడ్​డిమాండ్​చేశారు.

లీగల్​ఫైట్​చేస్తం: సుజాతపాల్​

తమ పార్టీ ఇన్​చార్జీ మున్షీపై బీజేపీ నేత ప్రభాకర్​చేసిన కామెంట్స్ పై లీగల్ గా ఫైట్ చేస్తామని ఏఐసీసీ మీడియా ఇన్​చార్జి సుజాత పాల్ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్​ఇచ్చారు. ‘బీజేపీ నేత ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్ కు మహిళ శక్తి గురించి తెలియదు. ఆయన తన పురుషాధిక్యతను, మహిళ వ్యతిరేకతను బయటపెట్టుకున్నడు. ప్రభాకర్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి’ అని సుజాత పాల్​అన్నారు.