ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వారం రోజులుగా చల్లటి గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. ఆదిలాబాద్ జిల్లా బీంపూర్ మండలంలోని అర్లి టీ, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు, నిజామాబాద్ జిల్లా కోటగిరి, కామారెడ్డి జిల్లా బీబీపేట, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, మెదక్ జిల్లా మనోహరాబాద్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, వికారాబాద్ జిల్లా నాగారంలో ఆదివారం అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
గతేడాది నవంబర్ నెలతో పోలిస్తే ప్రస్తుతం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. ఈ నెల 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఐదు రోజుల్లోనే 8 డిగ్రీలు పడిపోయింది. ఈ ఏడాది వర్షాలు అధికంగా పడడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో ఉదయం 12 గంటల వరకూ చల్లటి గాలులు వీస్తున్నాయి.
