ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఈటల బాధితుల సంఘం ప్రెస్ మీట్..దాడికి పాల్పడిన బీజేపీ నేతలు

ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఈటల బాధితుల సంఘం ప్రెస్ మీట్..దాడికి పాల్పడిన బీజేపీ నేతలు

ఉప్పల్, వెలుగు :  ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను తెలుపుకునే అధికారం ఉందని, భారత రాజ్యాంగం కల్పించిన  హక్కును బీజేపీ నేతలు కాలరాయాలని చూడడం సరికాదని ఈటల రాజేందర్ బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పరపు సంపత్ అన్నారు.  ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.  కవరేజి కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వెళ్లారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా,మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ అనేక దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురిచేశారని, పీడీ యాక్ట్ లు కూడా నమోదు చేయించి జైళ్ల పాలు చేశాడని బాధితులు ఆరోపించారు.  

అలాంటి రాజేందర్ నేడు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని, అతడి అరాచకాలను బయటపెట్టి నిజస్వరూపాన్ని తెలియజేయడం కోసమే బాధితులమంతా మీడియా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.  దీంతో అక్కడికి ఉప్పల్ కు చెందిన బీజేపీ నేతలు గోనె శ్రీకాంత్, బాల చందర్, తెలంగాణ సంపత్, దేవేందర్ రెడ్డి, కార్తీక్ లతో పాటు భారీగా తరలివచ్చినవారు స్టేజి పైకి వెళ్లి మాట్లాడే వారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. అంతేకాకుండా దాడులను అడ్డుకునే క్రమంలో మీడియా ప్రతినిధులపైనా దాడి చేశారు. అంతటితో ఆగకుండా మైకులు, లోగోలు, కెమెరాలను ధ్వంసం చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మరికొందరు పారిపోయారు.  బీజేపీ నేతల దాడి హేయమైన చర్య అని టీయూడబ్ల్యూజే ఐజేయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమిది బాల్ రాజు గౌడ్ ఖండించారు. పోలీసులు  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.