బండి సంజయ్​పై దాడిని ఖండించిన బీజేపీ నేతలు

బండి సంజయ్​పై దాడిని ఖండించిన బీజేపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ పీఠాలు కదుల్తున్నందునే ఆ పార్టీ వాళ్లు దాడులకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ పార్టీ దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ‘‘దాడిని టీఆర్ఎస్ మంత్రి సమర్థించుకోవడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మట్టి కదులుతా ఉంది. అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు మంచిది కాదు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్ని దాడులు చేసినా.. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా.. మీ కుటుంబ పాలనను ప్రజలు అంతం చేస్తారు” అని కిషన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఒక పెద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తుంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు.

ఓర్వలేకనే దాడులు.. 

‘‘బండి సంజయ్ పాదయాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో సంజయ్ చేపట్టిన పాదయాత్ర కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ వాళ్లు దాడులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కావాలనే కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాడు. దాడులు చేయిస్తూ.. కేసులు పెడుతూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఇకపై వారి ఆటలు సాగవు. రాష్ట్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుంది” అని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కాగా, సికింద్రాబాద్ టకరా బస్తీలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వివేక్ పాల్గొన్నారు. బస్తీలో ఎన్నో ఏళ్లుగా వినూత్నంగా జెండా వేడుకలు నిర్వహిస్తున్న మధుకర్ ను అభినందించారు. 

దాడులు సంహించం: బీసీ సంఘాలు

బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌‌ పాదయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తూ 13 బీసీ సంఘాలు ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశాయి. బీసీ కులాల నాయకులపై దాడులు జరిగితే సహించేది లేదని, రాష్ట్ర సర్కార్‌‌‌‌ను హెచ్చరించాయి. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనను ఖండించిన వారిలో ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేశ్, జిల్లపల్లి అంజి, జి.అనంతయ్య, పగిడాల సుధాకర్‌‌‌‌, సి.రాజేందర్‌‌‌‌, జి.కృష్ణయాదవ్, రామంజనేయులు, గోరిగె మల్లేశ్ యాదవ్, కూనూరు నర్సింహగౌడ్​ అన్నారు.