ఆకలి తీర్చేందుకు ‘మోడీ కిచెన్స్’

ఆకలి తీర్చేందుకు ‘మోడీ కిచెన్స్’
  • తమిళనాడులో భోజనం పంపిణీ చేస్తున్న బీజేపీ నేతలు

చెన్నై: లాక్ డౌన్ కారణంగా ఆకలికి అలమటించే పేదలకు ‘మోడీ కిచెన్స్’ ద్వారా తమిళనాడులో బీజేపీ నేతలు భోజనం పంపిణీ చేస్తున్నారు. తిండికి తిప్పలు పడుతున్న పేదలకు, రోజూవారీ కూలీలకు పార్టీ నేతలు అండగా ఉండాలంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతలు మోడీ కిచెన్ పేరిట ప్రతి రోజు భోజనం ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంచుతున్నారు. కోయంబత్తూరులో మోడీ కిచెన్​ను ఆ రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ వనాతి శ్రీనివాసన్ ప్రారంభించారు. ఈ కిచెన్ ద్వారా రోజుకు 500 మందికి సేవలందిస్తున్నారు. మరో నేత, మాజీ ఎంపీ సీపీ రాధాకృష్ణన్ పశ్చిమ కోయంబత్తూర్, తిరుప్పూర్​లో రెండు కిచెన్లను ప్రారంభించి రోజుకు 1,000 మందికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. మీనా దేవ్ నాగర్‌కోయిల్‌లో రోజూ 500 మందికి ఆహారం అందిస్తున్నారు.

ఇంటి దగ్గరికే ఫుడ్ సప్లై చేస్తున్నం
‘‘మా స్థాయిని బట్టి మోడీ కిచెన్ల ద్వారా భోజనం ప్రిపేర్ చేసి.. పేద ప్రజల ఇంటి దగ్గరికే పంపిస్తున్నాం. ఫుడ్ తో పాటు కిరానా సామాను కూడా డైలీ లేబర్​లకు అందిస్తున్నాం’’ అని రాధాకృష్ణన్ చెప్పారు. ఫుడ్ పంపినీ చేస్తున్న తనకు జేపీ నడ్డా ఫోన్ చేసి ఆరా తీశారని, ఆయన తన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత తిరువల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ శశిధరన్ మీడియాతో చెప్పారు. శశిధరన్ జిల్లాలో 13 కిచెన్లను ఏర్పాటు చేసి కూలీలకు ప్రతిరోజూ భోజనం పంపిణీ చేస్తున్నారు. ‘‘మీరు జాగ్రత్తగా ఉంటూ, జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు సాయం చేయండి అని నడ్డా చెప్పారు. మీ మనుగడను ప్రశ్నార్థకం చేసుకోవద్దని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి కాకుండా చూసుకోవాలన్నారు”అని శశిధరన్ చెప్పారు. కష్ట సమయంలో ఆకలి తీర్చుతున్నందుకు పేదలు ఎంతో సంతోషపడుతున్నారని అన్నారు.