లక్షల మందితో మోడీ సభ

లక్షల మందితో మోడీ సభ
  • లక్షల మందితో మోడీ సభ
  • పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు


హైదరాబాద్, వెలుగు: జులై 3న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. సభ నిర్వహణ ఎలా చేయాలనే దానిపై పార్టీ నేతలు మంగళవారం పరేడ్​గ్రౌండ్​ను పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్, పార్టీ సంస్థాగత సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఎంపీ అర్వింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించి వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంట్రన్స్​కు ఎన్ని దారులుండాలి,  బారికేడ్ల నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. సభకు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ ఇన్​చార్జి అరవింద్ మీనన్, ఇంద్రసేనా రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ స్టేట్ ఆఫీసులో పార్టీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ మీనన్, ఇతర నేతలు సమావేశమై జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై చర్చించారు.


ఇయ్యాల ఢిల్లీలో బీఎల్ సంతోష్​తో భేటీ


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై ఆ పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​కు రాష్ట్ర నేతలు బుధవారం ఢిల్లీలో పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సమావేశాల ఏర్పాట్లకు  నియమించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆయనతో భేటీ కానున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్​ఈ కమిటీకి చైర్మన్​గా ఉన్నారు.


బండి సంజయ్​కు భద్రత పెంపు


బండి సంజయ్​కు రాష్ట్ర సర్కారు భద్రత పెంచింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం కరీంనగర్​లో సంజయ్ చేసిన కామెంట్లు దూమారం రేపడం, తాజాగా అగ్నిపథ్ పథకంతో అల్లర్లు జరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ చేసిన సూచనల మేరకు మంగళవారం నుంచి భద్రతను పెంచారు. సంజయ్​కు ఇప్పుడున్న గన్ మెన్​లు కాకుండా అదనంగా ఇక నుంచి 1 +5 సెక్యూరిటీతో పాటు ఆయన వెంట రోప్ పార్టీ, ఎస్కార్ట్ వెహికిల్ ఉంటుంది.


యోగాతో మానసిక ఉల్లాసం: సంజయ్ 


యోగా ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ప్రధాని మోడీ అని  బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడంతో పాటు మరో పదిమంది చేత చేయించాలని సూచించారు. యోగాతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంజయ్​తో పాటు బీజేపీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యవర్గ సమావేశాల ఇన్​చార్జి అరవింద్ మీనన్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేయాలని, హెల్దీగా ఉంటామని శివ ప్రకాశ్ అన్నారు.