కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతల వినతి

కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతల వినతి
  • కొనుగోళ్లు కట్టుకథ.. బైపోల్ రిజల్ట్స్​ మార్చలేరు:  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్
  • బీజేపీపై బురద జల్లే ప్రయత్నం: అరుణ్ సింగ్ 

న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మార్చేందుకు టీఆర్​ఎస్​ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ కట్టుకథ అల్లి జనం దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బీజేపీ ఎంపీ అనిల్ బలోని, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఓం పాతక్​లతో  కలిసి వెళ్లి సీఈసీ అధికారులకు రెండు పేజీల వినతి పత్రం అందజేశారు. తప్పుడు ఆరోపణలతో ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని 1951 సెక్షన్ 123(4)కు టీఆర్​ఎస్​ విఘాతం కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. అనంతరం రాజీవ్ చంద్రశేఖర్  మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కతోందని ఆరోపించారు. 

బీజేపీపై బురద జల్లే ప్రయత్నం: అరుణ్ సింగ్

ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ విమర్శించారు. మునుగోడు బై పోల్​లో బీజేపీ గెలుపు ఖాయమైందని, అందుకే టీఆర్ఎస్ కుట్రలకు తెరలేపిందన్నారు. ‘ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి బలం లేదు.  వంద మందికిపైగా ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చడం ఎలా సాధ్యం. అందులో నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొని ఏం చేస్తాం. అది బీజేపీ నేచర్ కాదు. టీఆర్ఎస్ ఫాల్స్ ఎలిగేషన్స్ తో బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ వ్యవహారంపై సీబీఐతో ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరవుతాయి’ అని అన్నారు. ఆడియో టేపులను క్రియేట్ చేసి, అందులో బీజేపీ పెద్దల పేర్లు ప్రస్తావించి ప్రజల్లో కన్ఫ్యూజన్​ క్రియేట్  చేస్తున్నారన్నారు. ఎన్ని కట్రలు చేసినా ప్రజల మనసు మార్చలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి  రావడం ఖాయమన్నారు. ‘18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నైతికతతో పాలన సాగిస్తున్నాం. అన్నీ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది’ అని అన్నారు.