గుర్రంపోడు తండాకు BJP నేతలు : కబ్జా అయిన గిరిజన భూముల్లో పర్యటన

గుర్రంపోడు తండాకు BJP నేతలు : కబ్జా అయిన గిరిజన భూముల్లో పర్యటన

గిరిజన భరోసా యాత్ర నిర్వహించేందుకు హుజూర్ నగర్ కు వెళ్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఎమ్మెల్యే సైదిరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు గిరిజనుల భూములు లాక్కుని… ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎస్టీ మోర్చా నేతలు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు తండాకు వెళ్తున్నారు. హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్ నుంచి ప్రత్యేక బస్సులో హుజూర్ నగర్ బయల్దేరారు బీజేపీ నేతలు.

మఠంపల్లి మండలంలో తమ భూములు కబ్జా చేశారని స్థానిక గిరిజనులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. నాగార్జునసాగర్ నిర్వాసిత గిరిజనుల భూములను కబ్జా చేశారని అంటున్నారు. గుర్రంపోడు తండా.. సర్వేనంబర్ 540లోని 18వందల 76 ఎకరాల భూములను సర్కారు అండతో.. స్థానిక టీఆర్ఎస్ నేతలు, వారి బినామీలు ఆక్రమించుకున్నారని విమర్శిస్తున్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. టీఆర్ఎస్ నేతలు భూ దందా చేస్తున్నారని.. గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని అంటోంది బీజేపీ. కాసేపట్లో  బాధిత గిరిజనులను కలువనున్నారు నేతలు.  వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. చలో హుజూర్ నగర్ కు భారీగా తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు సంజయ్. గిరిజనులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించడానికి బీజేపీ నేతలు రెడీ అయ్యారు.

పోలీసు కేసులు ఎదుర్కొంటున్న గిరిజనులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటామన్నారు సంజయ్. గిరిజనుల భూముల్ని టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు నేతలు. టీఆరెస్ ప్రభుత్వం వచ్చాకే గిరిజనులపై దాడులు పెరిగాయని విమర్శించారు బండి సంజయ్. పోలీసులతో తమను అడ్డుకోలేరని.. గిరిజనుల హక్కులను కాపాడుతామన్నారు. గిరిజనులకు సీఎం కేసీఆర్ న్యాయం చేయడం లేదని ఆరోపించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.