ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా ?

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా ?

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టారని బీజేపీ నేతలు బుధవారం ఫైర్ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు నూకలు చెల్లాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ తన 8 ఏండ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమే బీఆర్ఎస్ విధానమా? అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడమే బీఆర్ఎస్ సిద్ధాంతమా? లిక్కర్ పాలసీని దేశమంతటా విస్తరింపజేయడమే కేసీఆర్ ఉద్దేశమా? అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగం దేశంలో అమలు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా” అని విమర్శించారు. భైంసాలో అల్లర్లను, హైదరాబాద్ లో టెర్రరిస్టులను ప్రోత్సహించడమే కేసీఆర్ కొత్త పార్టీ విధానమా? అని ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్.. రాజకీయ పునరేకీకరణ కాదు. వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ నిరుద్యోగులు, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే. తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేక తన సొంత సోకుల కోసం ఖర్చు పెట్టడానికి ఆడుతున్న డ్రామాలివి. మునుగోడులో ప్రజలు బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం” అని లక్ష్మణ్ మండిపడ్డారు.


అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తుండు: అరుణ 
కేసీఆర్ అత్యంత అవినీతి మోడల్ పాలన చూపించారని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ అన్నారు. అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి అన్ని రాష్ట్రాల్లో గెలవాలని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ‘‘ప్రతి దానికీ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని కాలం గడిపిన కేసీఆర్..ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో మరో డ్రామాకు సిద్ధమైండు.  బీఆర్ఎస్ సంగతి దేవుడెరుగు. టీఆర్ఎస్ అస్థిత్వమే పోయింది. బీఆర్ఎస్ కు మునుగోడు ఎన్నిక ఫలితాలతో ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వబోతున్నారు” అని అన్నారు.  బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు, కేసీఆర్కు ఉన్న బంధం తెగిపోయిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని మండిపడ్డారు. ‘‘మద్యం, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసి.. అక్రమ సంపాదనతో దేశంలో రాజకీయం చేయాలని కేసీఆర్ కల కంటున్నారు. అది ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది” అని అన్నారు.