రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..ఎవరీమె

రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..ఎవరీమె

వారంరోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ముందున్న వారిలో  ఒకరైన బీజేపీ నాయకురాలు దియా కుమారిని మంగళవారం (డిసెంబర్ 12)  డిప్యూటీ సీఎంగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.

బీజేపీ అధిష్టానం తీసుకున్న ఆశ్చర్యకరమైన చర్యలో దియా కుమారిని డిప్యూటీ సీఎం గా ప్రకటించారు. ఆమెతోపాటు మరో కొత్త ముఖం ప్రేమ్ చంద్ బైర్వాను కూడా డిప్యూటీ సీఎంను చేశారు. జైపూర్ లో కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగిన శాసన సభా పక్ష సమావేశంలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్  శర్మను ముఖ్యమంత్రి ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చిన బీజేపీ అధిష్టానం.. డిప్యూటీ సీఎం లుగా కొత్త ముఖాలను పరిచయం చేస్తూ మరో ట్విస్ట్ ఇచ్చింది. 

ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభీ మోగించిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరనే అంశంపై చివరివరకు ఉత్కంఠకు తెరలేపింది. మొదట ఛత్తీస్ గఢ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, చివరగా రాజస్థాన్ లో మంగళవారం (డిసెంబర్ 12) ముఖ్యమంత్రిని ప్రకటించింది. ఛత్తీస్ గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయి, మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం గా భజన్ లాల్ శర్మ లను ప్రకటించించారు. ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం పదవి వరించిన వారు కొత్త ముఖాలే. 

మరో వైపు మూడు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పేర్లను కూడా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండేలా కొత్త ఫార్ములాను అమలు చేస్తుంది. రాజస్థాన్ లో కూడా ఇదే పంథాను అనుసరించి దియాకుమారి, ప్రేమ్ చంద్ బైర్వాను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించింది. 

దియా కుమారి ఎవరు? 

దియా కుమారి రాజస్థాన్ బీజేపీ నాయకురాలు. జైపూర్ రాజకుటుంబానికి చెందిన మహారాణి గాయత్రి దేవి మనమరాలు. జైపూర్ లోని విద్యాధర్ నగర్ అసెంబ్లీ స్థానం  నుంచి ఎన్నికల్లో గెలుపొందింది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో నూ వ్యూహం రచించినబీజేపీ అధిష్టానం.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నర్పత్ సింగ్  స్థానంలో దియా కుమారికి సీటు కేటాయించింది. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు దియాకుమారి రాజ్ సమంద్ ఎంపీగా ఉన్నారు.  రాజస్థా్న్ లో శాంతిభద్రతలు, పేపర్ లీక్ లతో సహా ప్రజాసమస్యలకు వ్యతిరేకంగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైపూర్ లో నిరసనలకు నాయకత్వం వహించారు దియాకుమారి. 

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటినుంచి గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో బీజేపీ అధిష్టానం ముందుకు సాగింది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల జరిగేతే అనూహ్యంగా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మూడు రాష్ట్రాల్లో సీఎంలు, డిప్యూటీ సీఎం ఎంపికలోనూ బీజేపీ అధిష్టానం తనదైన శైలీలో వ్యూహరచన చేసింది. అనుకున్న దానికప్రకారమే.. కొత్త ముఖాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలుగా ప్రకటించింది.