హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా బుద్ది రాలేదు

హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా బుద్ది రాలేదు

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ముందుగానీ తరువాత గానీ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని అన్నారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డిలు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా సీఎం కేసీఆర్ కు బుద్దిరాలేదని మండిపడ్డారు. కేసీఆర్ వైఖరిపై పార్టీ నేతలకు వెగటు పుట్టి టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని అన్నారు. గులాబీ కండువాను వదిలేస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. 

టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం..
సొంత పార్టీ నేతలకే వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.  పిచ్చివేషాలు వేసి లొంగదీసుకుంటామంటే తెలంగాణ సమాజం లొంగదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే అన్న ఈటల.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనోనిబ్బరం కోల్పోవద్దని సూచించారు. ఇన్నేళ్లు కష్టపడి పనిచేశామని, మరో 6 నెలలు ఇలాగే కష్టపడితే అధికారం మనదే అని భరోసా ఇచ్చారు.