- నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీరని ద్రోహం: ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
- పదవులన్నీ దక్షిణ తెలంగాణకేనా? అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: నీళ్ల విషయంలో రాష్ట్రానికి మాజీ మంత్రి హరీశ్ రావు తీరని ద్రోహం చేశారని, ఆయనను ఉరి తీసినా తప్పు లేదని బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండికొట్టేలా 299 టీఎంసీలకు గత ప్రభుత్వం ఎందుకు సంతకం పెట్టిందని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేసినవారికి తాలిబన్ చట్టాలు అమలు చేయాలన్నారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్‌చాట్ లో మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో జూరాల ప్రాజెక్టు అంచనాలను రూ.35 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.80 వేల కోట్లకు పెంచారనిఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
అన్ని కీలక శాఖలు, అన్ని పదవులు, అన్ని స్కీములు దక్షిణ తెలంగాణకేనా? ఉత్తర తెలంగాణ వాళ్ళు జెండాలు మోయడానికేనా? కనీసం నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వరా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు,119 నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని, ఏ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీని సీఎం చేయాలని, అలా చేస్తామంటే గవర్నర్ అపాయింట్‌మెంట్ తామే తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పాలన నడుస్తున్న తీరు చూస్తుంటే, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయరాదని అనిపిస్తోందన్నారు.
