కాళేశ్వరం అవినీతిపై చర్చ ఎందుకు పెట్టలే: ఎమ్మెల్యే పాయల్ శంకర్

కాళేశ్వరం అవినీతిపై చర్చ ఎందుకు పెట్టలే: ఎమ్మెల్యే పాయల్ శంకర్
  •     కాంగ్రెస్​పై బీజేపీ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనిపై అసెంబ్లీలో ఎందుకు చర్చ నిర్వహించలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు అనుగుణంగా శ్వేతపత్రంలో అప్పుల వివరాలపై స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మరో ఇద్దరు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేశ్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మా దగ్గర సాక్షాలున్నాయని గతంలో చెప్పిన కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు విచారణ కోసం ఫిర్యాదు చేద్దామంటే సరైన సహకారం అందడంలేదని అనడం సరి కాదన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్లే కదా.. ఎందుకు సీబీఐ ఎంక్వైరీ కోరడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టినా వాస్తవాలు బయటకు రావని.. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. తమ కన్నా ఒక సీటు తక్కువ ఉన్న ఎంఐఎం నేతలకు  ఎక్కువ  మాట్లాడేందుకు సభలో సమయం ఇచ్చారని శంకర్ అన్నారు. ‘‘మోటర్లకు మీటర్లు అని బీజేపీని బద్నాం చేయాలని చూశారు. కానీ ఈ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజం చెప్పారు. మోటర్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలని కేంద్రం చెప్పలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు సిగ్గు తెచ్చుకోవాలి”అని అన్నారు.

మెగా డీఎస్సీ వెంటనే వేయాలె

బీఆర్ఎస్ సర్కార్ ఖజానాను ఖాళీ చేసిందనే విషయం కాంగ్రెస్ కు తెలుసని ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.  ఇప్పటి వరకు మహాలక్ష్మి స్కీమ్ మాత్రమే అమలు చేశారు. మిగిలినవి ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ...ఆరు గ్యారంటీలు అమలుచేయడం సాధ్యం కాదని ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేయడానికే కాంగ్రెస్ సర్కార్ ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు. యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మెగా డీఎస్సీతో పాటు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి డిమాండ్ చేశారు.

ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు

బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఇతర నేతలు ఢిల్లీలో మకాం వేశారు. శుక్రవారం జరిగిన బీజేపీ నేషనల్ ఆఫీసు బేరర్ల మీటింగ్ లో పాల్గొన్నారు. అలాగే శనివారం అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో జరగనున్న సమావేశంలో పాల్గొననున్నారు. లోక్​సభ ఎన్నికలపై హైకమాండ్ రాష్ట్ర నేతలతో చర్చించే అవకాశం ఉంది.