- ఎఫ్ టీసీసీఐ హెచ్ఆర్ అవార్డుల కార్యక్రమంలో మంత్రి వివేక్
హైదరాబాద్, వెలుగు: పారిశ్రామిక అభివృద్ధి, కార్మిక సంక్షేమం మధ్య సమతౌల్యం సాధించడంలో కంపెనీల హ్యూమన్ రిసోర్సెస్(హెచ్ఆర్) విభాగం కీలకమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ టీసీసీఐ) హైదరాబాద్లో గురువారం నిర్వహించిన 7వ హెచ్ఆర్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. కొత్తగా కార్మిక చట్టాలు వచ్చినప్పుడు వ్యతిరేకత సహజమని అన్నారు. ఇటువంటి సందర్భాల్లో పరిశ్రమల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా తన తండ్రి వెంకటస్వామి రాజీ పడలేదని తెలిపారు.
ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో పెన్షన్ పథకం ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేస్తూ, ‘‘నేను సీఐఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిశ్రమల తరఫున మా తండ్రికి వినతిపత్రం ఇచ్చాను. అయినా, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మా తండ్రి ఎప్పుడూ కార్మిక పక్షపాతే! మా ఫ్యాక్టరీ ప్రారంభానికి వచ్చి అక్కడే కార్మిక సంఘాన్ని ప్రకటించారు. ఏ ప్రభుత్వానికైనా పారిశ్రామిక వృద్ధి ఎంతో కీలకం. అది ఉపాధిని ఇవ్వడంతోపాటు ఆదాయాన్నీ సమకూర్చుతుంది. మా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 115 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీలు) ఏర్పాటు చేస్తోంది. యువత వీటి సాయంతో ఉపాధి పొందాలి”అని మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. హెచ్ఆర్ రంగానికి సేవలు అందించిన సంస్థలకు, వ్యక్తులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. అవార్డుల కార్యక్రమానికి ముందు హెచ్ఆర్ కాన్క్లేవ్ నిర్వహించారు.
