- ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల అమ్మకాలు
- ఏడు నెలల్లోనే రూ.60 లక్షలకు పైగా టర్నోవర్
- ప్రత్యక్షంగా, పరోక్షంగా 300 మందికి ఉపాధి
- ఒక్కో మహిళకు నెలకు రూ.20వేల దాకా ఆదాయం
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలోనే తొలిసారిగా డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్ముకునేం దుకు ఏర్పాటైన ఖమ్మం మహిళా మార్ట్ సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకునే వేదికగా మార్ట్ నిలిచింది.
కార్పొ రేట్ షాపింగ్ మాల్ తరహాలోనే ఉండి.. ఓపెన్ చేసిన కొద్ది నెలల్లోనే ఉత్పత్తుల అమ్మకాలు కూడా పెరిగా యి. దీంతో ఉత్పత్తుల తయారు చేసే సంఘాలు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నాయి. తద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకెళ్తోంది.
గతంలో మహిళా సంఘాలు సొంతంగా తమ ఉత్పత్తులను అమ్ముకునేవి. అంతంత మాత్రమే అమ్మకాలు ఉండేవి. ఇప్పుడు మార్ట్ లో నాలుగైదింతలు అమ్మకాలు పెరగడంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా ఇది మహిళలకు స్థిరమైన ఆదాయ వనరుగా మారింది.
వందకుపైగా సంఘాల ఉత్పత్తులు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ లో భాగంగా ఖమ్మం మహిళా మార్ట్ ను తొలిసారి ఏర్పాటు చేసింది. దీన్ని గతేడాది మే 28న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కార్పొరేట్ రిటైల్ ఔట్ లెట్ తరహాలో మార్ట్ ను అప్పటి ఖమ్మం కలెక్టర్ ముజమిల్ ఖాన్ అభివృద్ధి చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మార్ట్ నడుస్తుం డగా, దీన్ని పూర్తిగా మహిళ లే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లోని 100కు పైగా డ్వాక్రా సంఘాల నుంచి ఉత్పత్తులను మండల సమాఖ్యల ద్వారా సేకరిస్తున్నారు.
నాణ్యతతో అందుబాటు ధరల్లో ఉత్పత్తులు
ఈ మార్ట్ లో ప్రధానంగా సేంద్రియంగా, స్థానికంగా తయారైన ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఇందులో బియ్యం, బెల్లం, తేనె, మసాలాలు, నూనెలు, పప్పులు, పిండి, చిరుధాన్యాలు, నాటు కోడిగుడ్లు, నెయ్యి, పూజా సామగ్రి, చేతి వస్త్రాలు, మట్టి పాత్రలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళలు, చెక్క కళాకృతులు, జూట్ బ్యాగులు, కలంకారి వస్త్రాలు, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు, క్లీనింగ్ సామగ్రి వంటివి ఉన్నాయి.
ఇవి నాణ్యతతో పాటు సరసమైన ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా నాణ్యమైన కొత్త ఉత్పత్తులను కూడా చేర్చుతున్నారు. స్టాక్ఆధారంగా ఎప్పటికప్పుడు మండల సమాఖ్యలకు ఆర్డర్లు ఇస్తున్నారు. మార్ట్ కు వచ్చే ఆదాయాన్ని జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య లు పంచుకొని కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నాయి.
మార్ట్ ప్రారంభించిన 7 నెలల్లోనే రూ. 60 లక్షల పైగా టర్నోవర్ సాధించి సక్సెస్అయింది. రెగ్యులర్రోజుల్లో రూ.35 వేలకు పైగా అమ్మకాలు జరుగుతుండగా, వీకెండ్స్‌తో పాటు ఇతర పండుగలు, సెలవు రోజుల్లో సేల్స్ రూ.50 వేల వరకు ఉం టుంది. గత నెలలో ఒకే రోజు రూ.85 వేల అమ్మకాలు జరిగాయి. మార్ట్ ముందు ఏర్పాటు చేసిన టీ స్టాల్ ద్వారా రోజుకు సగటున రూ. 4 వేల నుంచి రూ.5వేల ఆదాయం వస్తోంది.
పరోక్షంగా 300 మందికి ఉపాధి
ఈ మార్ట్ ద్వారా మహిళలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తుండడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, స్వావలంబన మరింత పెరుగుతోంది. ఆరుగురికి ఉపాధి కల్పించడమే కాకుండా, ఉత్పత్తి, ప్యాకేజింగ్, రవాణా వంటి వాటి ద్వారా 300 మందికి పైగా మహిళలకు పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.
ఖమ్మం మహిళా మార్ట్ సాధించిన విజయాన్ని గుర్తించిన ప్రభుత్వం, రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో ఇలాంటి మహి ళా మార్ట్ లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా డ్వాక్రా సంఘాల నెట్ వర్క్ మరింత బలోపేతమై, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఊతమివ్వనుంది.
