
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి లేదని, బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నదని బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీని అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బిల్లు పెట్టి, ఢిల్లీలో ధర్నాలు చేయడం కాంగ్రెస్ నాటకాలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నామని చెబుతూనే, ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.
2014లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండగా, ఇప్పుడు 42% రిజర్వేషన్ల పేరుతో అందులో 10% ముస్లింలకు కేటాయించడం కరెక్ట్ కాదన్నారు. దీనితో బీసీలకు దక్కే వాటా కేవలం 32 శాతం మాత్రమేనని ఆయన వివరించారు. రాహుల్ గాంధీ దేశమంతటా ‘తెలంగాణ మోడల్’ అని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఎవరికి, ఎప్పుడు ఇచ్చారో చెప్పగలరా అని పాయల్ శంకర్ ప్రశ్నించారు.