బండి సంజయ్ A1 ఎలా అవుతారు.. ప్రభుత్వ కథను సీపీ చెప్పారు : రఘునందన్

బండి సంజయ్ A1 ఎలా అవుతారు.. ప్రభుత్వ కథను సీపీ చెప్పారు : రఘునందన్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ విషయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. రెండు రోజుల్లోనే మాటలు మార్చారని.. ప్రభుత్వ పెద్దల మాటలను ఆయన చెప్పారా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. 4వ తేదీ ఒక మాట చెప్పి.. 5వ తేదీ మరో మాట చెప్పారని గుర్తు చేశారాయన. ఎవరో వాట్సాప్ ద్వారా  పంపించిన పేపర్ ను చూసి మాట్లాడిన బండి సంజయ్ ఏ1 ముద్దాయి ఎలా అవుతారని నిలదీశారు. చంపిన వ్యక్తి ఏ1 అవుతారని.. బండి సంజయ్ విషయంలో విరుద్ధంగా జరిగిందన్నారు రఘునందన్ రావు.

ఉదయం 9 గంటల 37 నిమిషాలకు పేపర్ లీక్ అయితే.. 11 గంటల 30 నిమిషాలకు బండి సంజయ్ కు వాట్సాప్ లో పేపర్ వచ్చిందని చెబుతున్నారని.. ఆ సమయానికి సగం మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి బయటకు వస్తారని.. బయటకు వచ్చిన క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే.. ఎలా లీక్ చేసినట్లు అవుతుందని ప్రశ్నించారాయన. 

శివగణేషన్ ఉదయం 9.37 గంటలకు పేపర్ ను ఫోన్ లో ఫొటో తీశారని.. బండి సంజయ్ కు పంపింది 11 గంటల 30 నిమిషాలకు అని.. ఈ మధ్యలో 200 వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు అయ్యిందని.. వాళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఎవరూ లేరా అని ప్రశ్నించారాయన. వీళ్లందరినీ వదిలేసి బండి సంజయ్ ను మాత్రమే అరెస్ట్ చేయటం వెనక కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తుందని.. ఈ ప్రశ్నలకు వరంగల్ సీపీ రంగనాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందనరావు. 

కోర్టులపై మాకు నమ్మకం ఉందని.. ఈ ప్రశ్నలన్నింటికీ అక్కడే న్యాయం జరుగుతుందన్నారాయన. ఇంతకీ నిందితుడుగా చెబుతున్న శివగణేషన్ తన ఫోన్ ను 24 గంటల్లోనే కోర్టులో డిపాజిట్ చేశారా లేదా అనేది పోలీసులు చెప్పాలన్నారు. క్వశ్చన్ పేపర్ ఫొటో తీసిన వ్యక్తికి.. బీజేపీతో సంబంధం ఉందా లేదా అని కూడా తేల్చాలన్నారు. వందల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటే.. సెంటర్ దగ్గర పోలీసులు ఎందుకు లేరని ప్రశ్నించారు రఘునందనరావు. ఎంపీ బండి సంజయ్ ఫోన్ కు పేపర్ వచ్చిన దాని కంటే ముందు ఎంత మందికి షేర్ అయ్యింది అనేది ఎందుకు చెప్పటం లేదని నిలదీశారాయన. 

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేపర్ లీక్ చేసిన శివగణేషన్ వాట్సప్ చాట్ ఎందుకు బయటపెట్టలేదని పోలీసులను ప్రశ్నించారాయన. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందని.. కావాలనే ఇందులో బండి సంజయ్ ని ఇరికించారని.. కోర్టులో తేల్చుకుంటామన్నారు ఎమ్మెల్యే రఘునందనరావు.

https://www.youtube.com/watch?v=Bvjc--CfgY0