
- అఘాయిత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకు లేడని ముందే డీసీపీ ఎట్ల చెప్తరు?:రఘునందన్ రావు
హైదరాబాద్, వెలుగు: నిందితులను వదిలేసి, తనపై కేసులు పెడతారా? అని పోలీసులను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ అఘాయిత్యం కేసులో వీడియోలు విడుదల చేశారంటూ ఆబిడ్స్ పోలీసులు ఆయనపై మంగళవారం కేసు నమోదు చేశారు. దీనిపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను అరెస్టు చేయకుండా, నాపై కేసులు పెడుతూ పోలీసులు తమ బుద్ధి ప్రదర్శించుకున్నారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధం లేదని డీసీపీ మాట్లాడడం సరికాదు. పెద్దోళ్లకు సంబంధం ఉందని ఆధారాలు బయటపెట్టాం. కేసును దాచిపెట్టొద్దని చెప్పాం. కోర్టు ముందు తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాం. అమ్మాయి ఫొటోలు గానీ, గుర్తింపు గానీ బయట పెట్టలేదు. ముద్దాయిలకు సంబంధించిన ఫొటోలు మాత్రమే చూపించాను. దానికి నేను కట్టుబడి ఉన్నా. నేరం చేసిన వారి మీద కేసు పెట్టకుండా, సాక్ష్యాలు బయటపెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు” అని ఆయన మండిపడ్డారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు నోటీసులు ఇస్తే, విచారణకు సహకరిస్తానని చెప్పారు. పోలీసుల యాక్షన్ ను బట్టే తన రియాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు.
జైలుకు వెళ్లడానికైనా రెడీ...
ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకుకు సంబంధం లేదని డీసీపీ ఎలా చెప్తారని రఘునందన్ ప్రశ్నించారు. అంత పెద్ద కేసు దర్యాప్తును కొన్ని గంటల్లోనే పూర్తి చేశారా? కేవలం మూడు గంటల్లోనే విచారణ ముగించారా? అని ప్రశ్నించారు. ఎవరిది తప్పో కోర్టు చెబుతుందన్నారు. ‘‘నేను తప్పు చేశానని పోలీసులు అంటున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ సీపీలతో పాటు సీఐల దాకా అందరూ తప్పులు చేస్తున్నారని నిన్ననే కోర్టు శిక్ష వేసింది. దీంట్లోనూ పోలీసులకే శిక్షలు పడుతయి. నాకేం శిక్షలు పడవు. ఎవరికుండే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వాళ్లకి ఉంటుంది. పోలీసులు చేయాల్సిన పని నేను చేశా. కానీ పోలీసోళ్లు పెద్దల్ని కాపాడాలని చూస్తున్నారు. పేదోడి తరఫున జైలుకు వెళ్లడానికైనా రెడీ. ఇప్పటిదాకా పోలీసులు నన్ను సంప్రదించలేదు. వాళ్లు నోటీసులు ఇస్తే స్పందిస్తా. వాళ్ల కోసమే ఎదురుచూస్తున్నా. కాంగ్రెసోళ్లు ఎంఐఎం వాళ్లను అరెస్టు చేయించాలి.. రఘునందన్ రావును కాదు’’ అని అన్నారు.