అగ్నిపథ్ స్కీంపై చర్చకు కేటీఆర్ సిద్ధమా?

అగ్నిపథ్ స్కీంపై చర్చకు కేటీఆర్ సిద్ధమా?
  • నిరుద్యోగుల ముసుగులో టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ గూండాలు
  • ఈ ఘటనకు సీఎం, హోం మినిస్టర్లదే బాధ్యత... డీజీపీ, నిఘా చీఫ్ రాజీనామా చేయాలె
  • ప్రతిపక్షాల ఉడుత ఊపులకు మోడీ భయపడరు.... దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

కరీంనగర్: అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆందోళన వెనక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ... సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని, నిరసనకారులు తమ ఆందోళను విరమించుకోవాలని కోరారు. మూడు రోజులుగా రాష్ట్ర నలు మూలల నుంచి వేలాది మంది యువకులు సికింద్రాబాద్ స్టేషన్ కు తరలివస్తోంటే... రాష్ట్ర నిఘా వ్యవస్థ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఆందోళనకారులు పెద్దఎత్తున విధ్దంసానికి పాల్పడుతుంటే డీజీపీ, నిఘా చీఫ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ముసుగులో ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ గుండాలు ఈ అల్లర్లకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడానికి  సిద్ధమయ్యాయని, అందుకే ఇలాంటి హింసాత్మక ఘటనలకు ఆజ్యం పోస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరిని అరెస్ట్ చేయడానికి చేతకాని పోలీసులు... ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న తనపై మాత్రం కేసుల మీద కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా తగ్గేదిలేదని, వారి ఉడుత ఊపులకు మోడీ ఏమాత్రం భయపడబోరని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఘటనకు సీఎం, హోం మంత్రి బాధ్యత వహించాలని, దమ్ముంటే అగ్నిపథ్ స్కీంపై చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.