
సీఎం కేసీఆర్ 119 నియోజకవర్గాలకు సీఎంలా కాకుండా కేవలం రెండు నియోజకవర్గాలకు మాత్రమే సీఎంలా ప్రవర్తిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్ధిపేటలాగే దుబ్బాకను కూడా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘సీఎం మళ్లీ దుబ్బాకను నిర్లక్ష్యం చేస్తున్నారు. సిద్ధిపేటకు ఇచ్చిన వరాలు దుబ్బాకకు కూడా ఇవ్వాలి. దుబ్బాకకు మరో వెయ్యి ఇండ్లు మంజూరు చేయాలి. సిద్దిపేటకు ఏం ఇచ్చారో.. దుబ్బాకకు కూడా అవన్నీ ఇవ్వాలని దుబ్బాక ప్రజలు కోరుకుంటున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి తర్వాతైనా మారతారని అనుకున్నాం. కానీ, ఇంకా అదే పద్దతిలో ముందుకు వెళ్తున్నారు. కొడుకు కోసం కొత్త సెక్రటేరియట్, అల్లుడి కోసం మెడికల్ కాలేజీ, మనవడి కోసం గజ్వేల్ డెవలప్‌మెంట్.. ఇవి తప్ప ఇంకేం లేవా? సిద్ధిపేటకు త్వరలోనే కొత్త ఎయిర్‌పోర్టు వస్తుందని సీఎం అన్నారు. ఆ ఎయిర్‌పోర్టు మీరు తెచ్చుకోండి లేకపోతే ఊరుకోండి. కానీ, మా దుబ్బాకలో కూలిపోయే స్థితిలో ఉన్న ఒక పాత బస్టాండ్ ఉంది. దాని స్థానంలో కొత్త బస్టాండ్‌కు నిధులు మంజూరు చేయండి. మీ నియోజకవర్గానికి ఎయిర్‌పోర్టు.. మా దుబ్బాకకు మాత్రం పాత బస్టాండేనా? హైదరాబాద్‌లో నిర్మించిన ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు 2004లో పూర్తైంది. అప్పడు జీంఆర్ సంస్థకు, సివిల్ ఏవియేషన్‌కు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మార్చి 23, 2033 దాకా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించడానికి అనుమతులేవు. అలాంటప్పుడు సిద్ధిపేటలో కొత్త ఎయిర్‌పోర్టు ఎలా వస్తుంది. సీఎం కేసీఆర్ మూడేండ్ల కింద వరంగల్‌లో కొత్త ఎయిర్‌పోర్టు వస్తుందని చెప్పారు. అది ఇంతవరకు రాలేదు. ఇప్పుడు చెప్పిన సిద్ధిపేటలో కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. త్వరలోనే వరంగల్, సిద్ధిపేట, ఖమ్మంలలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే సీఎం కేసీఆర్ ఈ మాటలు చెబుతున్నాడు. ఓట్ల కోసం మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నాడు’ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులు అంతా కలిసి ఓట్ల కోసం ఈ వరాల జల్లు కురిపిస్తున్నారని ఆయన అన్నారు.
For More News..