- రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్
బషీర్‌బాగ్, వెలుగు: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ఆరోపించారు. సర్పంచుల విధులు, నిధులను నిలిపివేసి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదని, దీంతో పలువురు సర్పంచులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు. హైదరాబాద్ లక్డికాపూల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణ మాదిగను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా భూమన్న యాదవ్ మాట్లాడుతూ.. మేజర్ గ్రామపంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ గ్రామపంచాయతీల అభివృద్ధికి రూ.5 లక్షలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జీపీలకు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
