టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‎కు పడుతుంది

టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‎కు పడుతుంది

నాంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీని బీఏసీకి ఆహ్వానించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మజ్లీస్ నేతలు చెప్పినప్పటి నుంచి స్పీకర్ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రఘునందన్ పైవ్యాఖ్యలు చేశారు.

‘స్పీకర్ కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీకి ఆహ్వానించడం లేదు. స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం. కానీ, స్పీకర్ తీరు సరిగా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడినపుడు బీజేపీని ఆహ్వానించారు. ఇప్పుడు ఎందుకు ఆహ్వానించడం లేదని అడుగుతే స్పీకర్ వద్ద సరైన సమాధానం లేదు. సభ స్పీకర్ అదుపులో నడుస్తున్నట్టు కనిపించడంలేదు. అందుకే స్పీకర్ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. స్పీకర్.. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో  పనిచేస్తున్నారనే అపవాదును మూటగట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే బీఏసీకి ఆహ్వానించవద్దనే నిబంధన ఎక్కడుందో చెప్పాలి. ఐదుగురు సభ్యులు ఉంటేనే బీఏసీకి ఆహ్వానించాలనే నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలి. బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీకి పిలవకపోవడంపై సోమవారం నిరసన తెలియజేస్తాం. సోమవారం రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అసెంబ్లీలోని  గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తాం. గతంలో అమలు పరిచిన విధానాలను కేసీఆర్  ప్రభుత్వం అమలు చేయాలి. సీఎం కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని, కొత్త విధానాలను అమలు చేస్తే.. టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‎కు పడుతుంది. సీఎల్పీని టీఆర్ఎస్ విలీనం చేసుకున్నప్పుడు.. భట్టి విక్రమార్కను మాత్రం బీఏసీకి ఎలా ఆహ్వానిస్తున్నారో  ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీజేపీ సభ్యులను బీఏసీకి ఎందుకు ఆహ్వానించడంలేదని భట్టి ప్రశ్నించడం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే అని ఇప్పటికైనా బట్టబయలు అయింది. కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్‎లో విలీనం అయ్యారు. మిగిలిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‎కు బీ టీంగా మారింది. అందుకే బీజేపీ సభ్యులను బీఏసీకి పిలువకపోయినా భట్టి సైలెంట్‎గా ఉంటున్నారు. అసెంబ్లీని కేవలం ఐదు రోజులు నడిపిస్తామని బీఏసీ నిర్ణయించడం బాధాకరం. బీఏసీలో టీఆర్ఎస్ చెప్పినదానికల్లా కాంగ్రెస్ తల ఊపుతోంది. అందుకే అధికార పార్టీ అనుకునన్ని రోజులు మాత్రమే అసెంబ్లీని నిర్వహిస్తోంది’ అని రఘునందన్ రావు అన్నారు.