గవర్నర్ జెండా ఎగరేస్తేనే కరోనా వస్తదా? : ఎమ్మెల్యే రఘునందన్

గవర్నర్ జెండా ఎగరేస్తేనే కరోనా వస్తదా? : ఎమ్మెల్యే రఘునందన్

గణతంత్ర దినోత్సవం రోజున కూడా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా సీఎం కేసీఆర్ వ్యవహరించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘునందన్ రావు.. గవర్నర్ ను, బీజేపీ పార్టీపై ఉన్న కోపంతో సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో జాతీయ జెండాకు అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరేడ్ గ్రౌండ్ లో పరేడ్ నిర్వహించాలని హైకోర్టు చెప్పినా ఆ మాటను సీఎం తుంగలో తొక్కడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను రద్దు చేయమని చెప్పడంలో ఆంతర్యం ఏంటని రఘునందన్ ప్రశ్నించారు. 

రాష్ట్రంలో రాజకీయాలను సీఎం ఇంతగా దిగజార్చడం బాధాకరమని రఘునందన్ అన్నారు. కరోనా పేరుతో గణతంత్ర వేడుకల్ని నిర్వహించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ పెట్టినప్పుడు, కేసీఆర్ పుట్టిన రోజు నాడు కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తే కరోనా ప్రబలదా అని ప్రశ్నించారు. గవర్నర్ జాతీయ జెండాను ఎగురేస్తేనే కరోనా ప్రబలుతుందనడం కేసీఆర్ ఓర్వలేని గుణానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకుని రాజకీయాలను మరింత దిగజార్చకుండా చూసుకోవాలని రఘునందన్ హితవు పలికారు.