దళితులన్నా, అంబేద్కర్ ​అన్నా కేసీఆర్‌‌కు నచ్చదు

దళితులన్నా, అంబేద్కర్ ​అన్నా కేసీఆర్‌‌కు నచ్చదు
  • సీఎం కేసీఆర్​పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​ ఫైర్
  • కేసీఆర్​ మాటలు పొద్దుతిరుగుడు లెక్కుంటయ్

ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు: సీఎం కేసీఆర్​కు దళితుల పేరు పలకడం కూడా ఇష్టముండదని, ఇక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అంటే అసలే గిట్టదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు మండిపడ్డారు. అందుకే అంబేద్కర్ ​పేరిట స్టార్ట్ చేసిన తుమ్మిడిహట్టి – ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ ప్రాణం తీసి, కాళేశ్వరం పేరిట తన క్రెడిట్ కోసం కాసుల వర్షం కురిపించుకునేలా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాగజ్​నగర్​లో బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ నేత ​పాల్వాయి హరీశ్​బాబు చేపట్టిన ప్రాణహిత జలసాధన పాదయాత్ర ప్రారంభోత్సవంలో రఘునందన్​రావు​పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

ప్రాజెక్టు తరలింపునకు ముందే ప్లాన్

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తరలింపును కేసీఆర్ ముందే ప్లాన్ చేసుకున్నాడని, ప్రాణహితను తరలిస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కనీసం మాట్లాడలేదని రఘునందన్​ ఆరోపించారు. చీటికీమాటికీ అతిగా స్పందించే చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేగా అప్పటి సీఎం వైఎస్ ​​వెంట ఉన్న కోనేరు కోనప్ప నోరు విప్పలేదన్నారు. కేసీఆర్ మాటలు పొద్దుతిరుగుడు పూల లెక్క ఉంటాయన్నారు. 2018 ఎన్నికల సమయంలో కాగజ్​నగర్​లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రాణహిత ప్రాజెక్టు గురించి ఆందోళనపడొద్దని, 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, దీని కోసం మంచి ప్రాజెక్టు ఇక్కడే కడతానని చెప్పి ఇప్పటి వరకు ఆ మాట నెరవేర్చలేదన్నారు. 

పోలీసు రాజ్యం నడుపుతున్నరు

హరీశ్​రావు, కేటీఆర్ తెల్లారితే ఏదో ముచ్చట మాట్లాడుతుంటారని, దేశంలో ఎక్కడా లేని వడ్ల పంచాయితీ తెలంగాణలోనే ఎందుకు ఉందో తెలుసుకోవాలని రఘునందన్​ సూచించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం నడుపుతున్నారని, తెలంగాణ రాకముందు నిర్బంధం కంటే ఇప్పుడు రాష్ట్రంలో పోలీస్ ​యాక్ట్ పెట్టి సభలు, ర్యాలీలు జరగకుండా అణగదొక్కుతున్నారని ఆరోపించారు. కుమ్రంభీం, శివాజీ పోరాట స్ఫూర్తితో ప్రాణహిత ప్రాజెక్టు సాధన సహా అన్ని విషయాలపైనా బీజేపీ పోరాడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రాణహిత కట్టితీరుతమన్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతిపరులు: ప్రేమేందర్​రెడ్డి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి ఊబిలో కూరుకుపోయారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​రెడ్డి ఆరోపించారు. పాల్వాయి హరీశ్​బాబు చేపట్టిన పాదయాత్రను ఈస్​గాంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్​అధికారం చేపట్టిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టునే నామరూపాలు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రాణహిత పుష్కరాలకు రూ.50 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టకపోతే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.